రాహుల్‌ను కలిసేందుకు శ్రీనగర్‌కు వెళ్లిన‌ సోనియా గాంధీ

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మూడు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం శుక్రవారం

By Medi Samrat  Published on  26 Aug 2023 1:27 PM GMT
రాహుల్‌ను కలిసేందుకు శ్రీనగర్‌కు వెళ్లిన‌ సోనియా గాంధీ

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మూడు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం శుక్రవారం శ్రీనగర్ చేరుకున్నారు. సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్‌ను కలిసేందుకు ఈరోజు శ్రీనగర్‌కు చేరుకున్నారు. శనివారం రాహుల్ గాంధీని కలిసేందుకు సోనియా వచ్చినట్లు కాంగ్రెస్ వ‌ర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శ్రీనగర్‌లోని నిజీన్ సరస్సు వద్ద బోటు షికారు చేస్తూ కనిపించారు. రాహుల్ సోదరి ప్రియాంక, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా అక్క‌డికి వెళ్లే అవ‌కాశం ఉంది. శ్రీనగర్ పర్యటనను కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ టూర్‌గా అభివర్ణిస్తోంది. ఈ పర్యటనలో నేతలిద్దరూ పార్టీ సమావేశాలకు హాజరుకావడం లేదని చెబుతున్నారు.

రాహుల్ గాంధీ గత కొన్ని రోజులుగా లడఖ్ పర్యటనలో ఉన్నారు. రాహుల్ లేహ్-లడఖ్‌లోని అనేక ప్రదేశాలను సందర్శించారు. నిన్ననే రాహుల్ కార్గిల్ బహిరంగ సభలో ప్రసంగించారు. రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. చైనాపై కేంద్ర ప్రభుత్వం అసలు నిజం చెప్పడం లేదన్నారు. లడఖ్ ఒక వ్యూహాత్మక ప్రదేశం అన్నారు. భారత్ నుంచి భూమిని చైనా లాక్కుంది. చైనా ఒక్క అంగుళం భూమిని కూడా లాక్కోలేదని విపక్షాల సమావేశంలో ప్రధాని మోదీ అనడం బాధాకరమన్నారు. ప్రధాని మాటలు పూర్తిగా అబద్ధం. లడఖ్ భూమిని చైనా ఆక్రమించిందని లడఖ్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రధాని నిజం మాట్లాడడం లేదు. లడఖ్ టూర్ చివరి రోజున కార్గిల్‌లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈ విషయాలు చెప్పారు.

సరిహద్దులో ఎప్పుడు యుద్ధం జరిగినా లడఖ్ ప్రజలు ధైర్యంగా ఎదుర్కొన్నారని రాహుల్ గాంధీ అన్నారు. లడఖ్ తన ధీరత్వాన్ని ఒక్కసారి కాదు చాలా సార్లు చూపించింది. ఇందుకు లడఖ్ ప్రజలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నేను లడఖ్‌లోని ప్రతి మూలకు వెళ్లాను. నేను మీ (లడఖీ) మాట వినాలని అనుకున్నాను. లడఖ్ ప్రజల సమస్యలను, వారి వాస్తవ సమస్యలను అర్థం చేసుకోవడానికి తాను ప్రయత్నించానని రాహుల్ అన్నారు.

Next Story