విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంపై ఎన్‌సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ స్పందించారు. విమాన దుర్ఘటన పూర్తిగా ప్రమాదమేనని దీన్ని రాజకీయం చేయొద్దని కోరారు. విమాన ప్రమాదంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన శరద్ పవార్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
అజిత్ మరణం మహారాష్ట్రకు ఒక పెద్ద షాక్ అని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. కష్టపడి పనిచేసే, సమర్థుడైన నాయకుడిని రాష్ట్రం కోల్పోయిందన్నారు. జరిగిన ఈ నష్టం పూడ్చలేనిదని అన్నారు. అన్ని విషయాలు మన చేతుల్లో ఉండవని తెలిపారు. ఈ సంఘటనలో ఏదో రాజకీయం ఉందని కోల్‌కతా నుంచి ఒక వాదన వినిపించిందని, కానీ అలాంటిదేమీ లేదన్నారు. ఇదొక ప్రమాదమని, ఇందులోకి దయచేసి రాజకీయాలను తీసుకురావద్దని కోరుతున్నానని పేర్కొన్నారు. బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది విదీప్ జాదవ్, పింకీ మాలీ, పైలట్ ఇన్ కమాండ్ సుమిత్ కపూర్, ఫస్ట్ ఆఫీసర్ శాంభవి పాఠక్ మరణించారు. దీంతో మహారాష్ట్రతో పాటు యావత్ దేశం విషాదంలో మునిగిపోయింది.
కాగా బుధవారం మమతా బెనర్జీ మాట్లాడారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బెనర్జీ పిలుపునిచ్చారు. అయితే మిగతా అన్ని సంస్థలు పూర్తిగా రాజీపడ్డాయని ఆమె ఆరోపించారు. అయితే ఎన్‌సీపీ నాయకుడి కుటుంబసభ్యులకు అండగా నిలవాల్సిన సమయంలో బెనర్జీ రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ ఫైర్ అయింది.