నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ రాజీనామాపై వెనక్కి తగ్గారు. రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని పార్టీ సీనియర్ నేతల కమిటీ తీర్మానం మేరకు ఆయన వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. మద్దతుదారులు, ఓటర్లు చాలా సంవత్సరాలుగా తనవెంట ఉన్నారని, వారి మనోభావాలను విరుద్ధంగా వ్యవహరించలేనని.. తనపై ఉన్న ప్రేమ, నమ్మకానికి తాను కదిలిపోయానని అన్నారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు తాజాగా ఆయన ప్రకటించారు. ముంబైలో పార్టీ అగ్రనేతలు సమావేశం నిర్వహించి.. ఆయన పదవి నుండి తప్పుకోడాన్ని ఏ మాత్రం ఒప్పుకోలేదు. 1999లో తాను స్థాపించిన పార్టీ అధినేతగా కొనసాగుతానని ఆయన చెప్పారు. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, మేనల్లుడు అజిత్ పవార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. శరద్ పవార్ ఇటీవల పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు కమిటీని వేశారు. సమీప భవిష్యత్‌లో కొత్త తరం విజయవంతం అయ్యేందుకు పార్టీకి సంస్థాగత మార్పులను సూచించారు. కానీ అందుకు కార్యకర్తలు ఒప్పుకోకపోవడంతో రాజీనామాను పవార్ వెనక్కు తీసుకున్నారు.