నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. నవంబర్ 2న శరద్ పవార్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు పార్టీ అధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. నవంబర్ 4-5 తేదీల్లో షిర్డీలో జరిగే పార్టీ శిబిరాల్లో పవార్ పాల్గొంటారని సమాచారం. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీరావు గార్జే అధికారిక లేఖలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్లు, కార్యకర్తలందరూ ఆసుపత్రి వెలుపల గుమిగూడవద్దని కోరారు.
నాందేడ్ మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశించనున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'లో నవంబర్ 8న శరద్ పవార్ పాల్గొననున్నారు. ఈ విషయమై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే వార్తా సంస్థ పిటిఐతో మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్రలో భాగం కావాలన్న ఆహ్వానాన్ని పవార్ అంగీకరించారని చెప్పారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు కూడా ఆహ్వానం పంపామని.. ఆయన ధృవీకరించాల్సివుందని అన్నారు.