మూడు నెలల్లో గేమ్‌ మొత్తం మారుస్తాను.. వెళ్లిన ఎమ్మెల్యేలంతా తిరిగి వస్తారు

Sharad Pawar on nephew Ajit's rebellion. ఎన్సీపీ నేత అజిత్ పవార్ తిరుగుబాటు నేప‌థ్యంలో ఆ పార్టీ అధినేత‌ శరద్ పవార్ మీడియా సమావేశం నిర్వహించారు

By Medi Samrat  Published on  3 July 2023 4:41 PM IST
మూడు నెలల్లో గేమ్‌ మొత్తం మారుస్తాను.. వెళ్లిన ఎమ్మెల్యేలంతా తిరిగి వస్తారు

ఎన్సీపీ నేత అజిత్ పవార్ తిరుగుబాటు నేప‌థ్యంలో ఆ పార్టీ అధినేత‌ శరద్ పవార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజిత్ పవార్ నిర్ణయంపై ఆయన ప్రశ్నలు సంధించారు. నన్ను వదిలేసిన వారు ఇప్పటికే ఎన్నికల్లో ఓడిపోయారని అన్నారు. 3 నెలల్లో మొత్తం గేమ్‌ను మారుస్తానని, అజిత్‌పవార్‌తో కలిసి వెళ్లిన ఎమ్మెల్యేలందరూ తిరిగి వస్తారని అన్నారు.

విలేకరుల సమావేశంలో శరద్ పవార్ మాట్లాడుతూ.. నాతో ఏ ఎమ్మెల్యే మాట్లాడలేదు. ఇదంతా నాకు కొత్త కాదు, ఇంతకు ముందు చూసినవే. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం జరుగుతోందన్నారు. ఎవరు వెళ్లిపోయారో.. వాళ్లలో ఎవరితోనూ తాను మాట్లాడలేదని అన్నారు.

మహారాష్ట్ర కేబినెట్‌లో నిన్న ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలైనా తీసుకునే హక్కు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్‌కు ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. మ్మెల్యేలు వెళ్లిపోవడంపై నాకు రెండు మూడు పాత అనుభవాలు ఉన్నాయని, భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.

అజిత్ పవార్ తిరుగుబాటుకు తన ఆశీస్సులు లేవని శరద్ పవార్ ఊహాగానాలను కొట్టిపారేశారు. ఇలా మాట్లాడటం తక్కువచేయ‌డ‌మేన‌న్నారు.. తెలివి తక్కువ వ్యక్తులు మాత్రమే అలా మాట్లాడ‌తార‌ని పవార్ అన్నారు. నేను రాష్ట్ర పర్యటనకు వెళ్తాన‌ని.. కార్య‌క‌ర్త‌ల్లో స్ఫూర్తి నింపుతానని తెలిపారు. కొందరు నాయకులు చేసిన పనికి వారు నిరుత్సాహపడకూడదన్నారు. తాను ఎవరిపైనా చర్యలు తీసుకోబోనని..కొంతమంది భిన్నంగా ప్రవర్తించినట్లు.. వ్యక్తిగతంగా నేను దురుద్దేశంతో వ్యవహరించే వ్యక్తిని కాదని అన్నారు.


Next Story