మహారాష్ట్ర ప్రభుత్వంలో ఊహించని మార్పులు రాబోతూ ఉన్నాయా..?
Sharad Pawar meets Narendra Modi, raises political heat. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అవ్వడం హాట్ టాపిక్ గా మారిన
By Medi Samrat Published on 18 July 2021 3:53 PM GMTభారత ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అవ్వడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని మోదీ నివాసానికి శరద్ పవార్ వెళ్లారు. వీరిద్దరి సమావేశం దాదాపు 50 నిమిషాల సేపు కొనసాగిందని నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. వర్షాకాల సమావేశాలు 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఇద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రపతి పదవి కోసం శరద్ పవార్ పోటీలో ఉన్నట్లు ఇటీవల వార్తలు రాగా ఈ వార్తలను ఆయన ఖండించారు. తాను రాష్ట్రపతి ఎన్నికల్లో నిలవడంలేదని పవార్ అన్నారు. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ఎన్సీపీ అధికారాన్ని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంపై ఈ భేటీ ఏ మేరకు ప్రభావాన్ని చూపబోతోందనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఈ భేటీ అలా ముగిసిందో లేదో మహారాష్ట్రలో బీజేపీ, ఎన్‌సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే వ్యాఖ్యలు చేశారు. పవార్ మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమి నుంచి బయటికి వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చేతులు కలుపాలని కోరారు. ఇక ఎన్సీపీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మాట్లాడుతూ బీజేపీ, ఎన్సీపీ పార్టీల మధ్య సిద్ధాంతపరమైన, రాజకీయ పరమైన విభేదాలు ఉన్నాయని, అలాంటి రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కూడా అథవాలే తనదైన శైలిలో మాట్లాడారు.
ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య కూడా రాజకీయపరమైన, సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయని, అయినా ఆ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని చెప్పారు. అలాంటప్పుడు బీజేపీ, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేవని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో శరద్‌పవార్ తప్పకుండా కూటమి నుంచి వైదొలిగి బీజేపీతో చేతులు కలుపుతారని భావిస్తున్నానని రామ్‌దాస్ అథవాలే చెప్పారు.