నిషేధిత సంస్థ జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ యాసిన్ మాలిక్‌కు ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన రెండు కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. మాలిక్‌కు రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది కోర్టు. ముందుగా యాసిన్ మాలిక్‌ను లాకప్ నుండి కోర్టు గదికి తీసుకువచ్చారు. న్యాయమూర్తి చేరుకోవడం ఆలస్యం కావడంతో కూర్చోవడానికి కుర్చీ ఇచ్చారు. కొంతసేపటికి న్యాయమూర్తి వచ్చి తీర్పు చెప్పారు. యాసిన్ మాలిక్‌కు ఈరోజు మొత్తం 9 సెక్షన్ల కింద శిక్ష విధించినట్లు తెలుస్తోంది.
మాలిక్ శిక్షపై మొదట మధ్యాహ్నం 3.30 గంటలకు తీర్పు రావాల్సి ఉండగా.. సాయంత్రం 4 గంటలకు వాయిదా పడింది. అనంతరం సాయంత్రం 6.15 గంటల ప్రాంతంలో తీర్పు వెలువడింది. కాగా, త్రివర్ణ పతాకంతో పలువురు కోర్టు వెలుపలకు చేరుకున్నారు. అదే సమయంలో శ్రీనగర్ సమీపంలోని మైసుమాలోని యాసిన్ మాలిక్ ఇంటి దగ్గర మాలిక్ మద్దతుదారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. రాళ్లు రువ్వడంతో భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాల్సి వచ్చింది.
శ్రీనగర్ సమీపంలోని మైసుమాలో యాసిన్ మాలిక్ ఇల్లు ఉంది. మాలిక్ ఇంటి చుట్టూ భద్రతా బలగాలను మోహరించారు. డ్రోన్ల ద్వారా ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు. యాసిన్ మాలిక్‌కు మరణశిక్ష విధించాలని NIA డిమాండ్ చేసింది. శిక్ష ఖరారుకు ముందు కోర్టు గది వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా సిబ్బందితో పాటు సాధారణ దుస్తుల్లో భద్రతా సిబ్బందిని కూడా మోహరించారు.