ఈడీ ఆఫీసుకు బీజేపీ బ్యానర్.. ఇదెక్కడి చోద్యం..!
Sena Puts BJP Office Banner at ED Office. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీచేసిన సంగతి
By Medi Samrat Published on 29 Dec 2020 5:51 PM IST
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీచేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఈడీ లాంటి విభాగాలను కేవలం బెదిరించడానికే వాడుతోందని ఆయన ఆరోపించారు. . రాజకీయ కుట్రలకు ఈడీని వాడుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాజకీయ యుద్ధమనేది ఫేస్ టు ఫేస్ ఉండాలని, వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఇలాంటి కుట్రలకు పాల్పడటం సరి కాదని అన్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో తాను మాట్లాడానని అన్ని ప్రశ్నలకు తమ పార్టీ సమాధానాలు చెపుతుందని అన్నారు. ఈడీ, సీబీఐ, ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ల ప్రాధాన్యత తగ్గిపోతోందని.. గతంలో ఈ విభాగాలు ఏదైనా యాక్షన్ తీసుకుంటే విషయం చాలా సీరియస్ గా ఉందని అనుకునేవారని.. కానీ ఇప్పుడు ఎవరిపైన అయినా యాక్షన్ తీసుకున్నాయంటే రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని విమర్శలు చేశారు.
ఇంతలో శివసైనికులు యాక్షన్ లోకి దిగారు. ముంబై లోని ఈడీ కార్యాలయం ఎదుట 'బీజేపీ ప్రదేశ్ కార్యాలయ్' అని బ్యానర్ ఏర్పాటు చేశారు. శివసేన భవన్ ఎదుట కార్యకర్తలు మహిళలు ఈడీ, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకులపై ఈడీని ఉసిగోల్పుతోందని ఆరోపించారు.
వర్ష రౌత్ కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సమన్లలో చెప్పినట్లుగా ఈ రోజు ఆమె ముంబైలోని ఈడీ కార్యాలయానికి హాజరుకావాల్సి ఉంది. ఈడీ విచారణకు ఆమె హాజరుకాలేదు. జనవరి 5 వరకు తనకు సమయం కావాలని ఈడీ అధికారులను ఆమె కోరినట్టు ఏఎన్ఐ తెలిపింది. గతంలో సమన్లు పంపినప్పుడు కూడా అనారోగ్య కారణాలతో ఆమె విచారణకు హాజరుకాలేదు.