రాహుల్ 'భారత్ జోడో యాత్ర-2' ఆ రాష్ట్రం నుంచే ప్రారంభం

Second Phase Of Rahul Gandhi Bharat Jodo Yatra From Gujarat To Meghalaya

By Medi Samrat  Published on  8 Aug 2023 9:03 PM IST
రాహుల్ భారత్ జోడో యాత్ర-2 ఆ రాష్ట్రం నుంచే ప్రారంభం

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తొలి దశకు విశేష స్పందన వచ్చిందని.. రెండో దశ గుజరాత్ నుంచి మేఘాలయ వరకు సాగుతుందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే తెలిపారు. అదే సమయంలో మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తారని ఆయన తెలిపారు. మహారాష్ట్రలో యాత్రకు సన్నాహకంగా రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ స్థానానికి 48 మంది పార్టీ పరిశీలకులను నియమించినట్లు పటోలే తెలిపారు. ఈ పరిశీలకులు ఆరు రోజుల్లోగా క్షేత్రస్థాయి పరిస్థితిపై నివేదికను సమర్పించనున్నారు, ఆ తర్వాత ఆగస్టు 16న కోర్ కమిటీ సమావేశం జరగనుంది.రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్రను చేపట్టనున్నారన్న విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జై రామ్ రమేశ్ వెల్లడించారు. ఈ యాత్ర గుజరాత్ లో మహాత్మా గాంధీ జన్మస్థలమైన పోర్ బందర్ నుంచి ప్రారంభమవుతుందని, అరుణాచల్ ప్రదేశ్ లోని పాసిఘాట్ వరకు ఈ యాత్ర కొనసాగుతుందని గతంలో ప్రకటించారు. పాద యాత్ర రూట్ మ్యాప్ పై కాంగ్రెస్ పార్టీలో కసరత్తు కొనసాగుతున్నట్లు సమాచారం.

తొలి విడత భారత్ జోడో యాత్ర గత ఏడాది సెప్టెంబర్ లో దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా.. 130 రోజుల పాటూ 4 వేల కిలోమీటర్లకు పైగా ఈ పాదయాత్ర కొనసాగింది. జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ లో ముగిసింది.

Next Story