ఛార్జింగ్‌లో ఉన్న స్కూటీ బ్యాటరీ పేలుడు.. ఒకరి మృతి.. స్లాబ్ పైకప్పుకు పగుళ్లు
Scooty battery in cracked charging. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లోని సెక్టార్ -40 పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గదిలో ఛార్జింగ్ పెట్టిన
By Medi Samrat Published on 18 Dec 2021 10:15 AM GMTహర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లోని సెక్టార్ -40 పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గదిలో ఛార్జింగ్ పెట్టిన స్కూటీ బ్యాటరీ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. మంటలు, పొగ కారణంగా ఊపిరాడక ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో అతని భార్య, ముగ్గురు కుమారులకు గాయాలయ్యాయి. గురువారం రాత్రి వేళ పేలుడు కారణంగా ఒక్కసారిగా మంటలు రావడంతో ఇరుగుపొరుగు వారు కిటికీ గ్రిల్‌ను పెకిలించి, అందరినీ బయటకు తీసి మంటలను అదుపు చేశారు. ఘటనలో గాయపడిన మహిళ, ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని, మరో ఇద్దరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని పోలీసులు తెలిపారు.
వివరాళ్లోకెళితే.. బీహార్‌కు చెందిన సురేష్ షా, భార్య రీనా, కుమారులు మనోజ్, సరోజ్, అనూజ్‌లతో కలిసి సెక్టార్ -40 పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు నాలుగేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. సురేష్ సీఎన్‌జీ పంపు ఏరియాలో టీ కొట్టు నడిపేవాడు. మనోజ్, సరోజ్‌లు బ్యాటరీ స్కూటర్ కంపెనీలో పనిచేసేవారు. గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో అందరూ తమ గదిలో పడుకున్నారు. పడుకునేముందు స్కూటీ బ్యాటరీని రూమ్ లోనే ఛార్జింగ్ పెట్టారు. అకస్మాత్తుగా అది రాత్రి పేలడంలో గదిలో మంటలు చెలరేగి పొగలు అలుముకున్నాయి. ఈ క్రమంలో పేలుడు శబ్ధం విని ఇరుగుపొరుగు వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
తలుపులు తీయడానికి ప్రయత్నించినా తలుపులు తెరుచుకోకపోవడంతో కిటికీకి ఉన్న ఇనుప గ్రిల్‌ను బయటి నుంచి కట్ చేశారు. అనంతరం గది లోపలికి వెళ్లి తలుపులు తెరిచి అందరినీ బయటకు తీశారు. అయితే.. అప్పటికే సురేష్ మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల నివేదిక ప్రకారం.. పేలుడు చాలా బలంగా సంభవించిందని.. పేలుడు ధాటికి స్లాబ్ పైకప్పు పగిలిపోయింది. అయితే అదృష్టవశాత్తూ పైకప్పు కూలకపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది.