భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అవుతుంది. వరదలతో నగరాలు చెరువులను తలపిస్తున్నాయి. తాజాగా వర్షాల కారణంగా రాష్ట్ర రాజధాని చెన్నైలోని తిరునెల్వేలి సహా తమిళనాడులోని ఏడు జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు రేపు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. రేపు తిరునెల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో అతి భారీ వర్షాలు, రామనాథపురం, తూత్తుకుడి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేఫథ్యంలోనే పాఠశాలలు, కళాశాలలకు రేపు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
రెండు రోజుల క్రితం వాతావరణ శాఖ రాష్ట్రంలో భారీ వర్షాల నేఫథ్యంలో ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీని తరువాత అనేక ప్రాంతాలలో వరదలు ముంచెత్తడంతో 22 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. పంటలు, భవనాలు, రోడ్లు అనేక రకాలుగా అపార నష్టం వాటిల్లింది. మరోమారు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో నష్ట నివారణ చర్యలపై అధికారులు కసరత్తు చేపట్టారు.
ఇదిలావుంటే.. తమిళనాడులో ఇప్పటి వరకు 50,000 హెక్టార్లకు పైగా సాగైన పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ వర్షాకాలంలో సగటు వర్షపాతం కంటే 68 శాతం అధికంగా వర్షం కురిసింది. అక్టోబర్ నుంచి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 2,300కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. నవంబర్ రెండో వారం నుండి వరుసగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని మూడింట రెండు వంతుల ప్రాంతాలు జలమయమయ్యాయి.