ఫిబ్రవరి 1నుండి పాఠశాలలు పునఃప్రారంభం

Schools And Colleges In Tamil Nadu Will Be Resumed From February. తమిళనాడులో కరోనావైరస్ వ్యాప్తి నేప‌థ్యంలో మూసివేయబడిన పాఠశాలలు, విద్యాసంస్థలు

By Medi Samrat  Published on  28 Jan 2022 4:59 AM GMT
ఫిబ్రవరి 1నుండి పాఠశాలలు పునఃప్రారంభం

తమిళనాడులో కరోనావైరస్ వ్యాప్తి నేప‌థ్యంలో మూసివేయబడిన పాఠశాలలు, విద్యాసంస్థలు ఫిబ్రవరి 1నుండి పునఃప్రారంభమవుతాయని రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది. రాత్రి 10 నుండి 5 గంటల వరకు విధించిన కర్ఫ్యూ రేపటి నుండి రద్దు చేయనున్న‌ట్లు తెలిపారు. అలాగే.. ఈ ఆదివారం అంటే జనవరి 30న పూర్తి లాక్‌డౌన్ ఉండదని అధికారులు తెలిపారు. క‌రోనా వ్యాప్తి, సంక్రాంతి నేప‌థ్యంలో జనవరి మ‌ధ్య‌ వరకు హయ్యర్ సెకండరీ విద్యార్థులను ఆన్‌లైన్ క్లాసుల‌కు అనుమతిస్తూనే ప్రభుత్వం పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. అనంతరం అన్ని హయ్యర్ సెకండరీ పాఠశాలలను నెలాఖరు వరకు మూసివేయాలని సూచించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్, చీఫ్ సెక్రటరీ వీ ఇరై అన్బు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలో కొన్ని సడలింపులు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తు, ప్రజల జీవనోపాధి, ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థను పరిగణనలోకి తీసుకుని అమలులో ఉండే మ‌రికొన్ని నిబంధ‌న‌లు ఫిబ్రవరి 1 నుండి 15 వరకు అమలుచేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

1 నుండి 12 తరగతుల విద్యార్ధుల‌కు పాఠశాలలు ఫిబ్రవరి 1న ప్రారంభమవుతాయి. కోవిడ్ కేర్ సెంటర్‌లుగా పనిచేసే కళాశాలలు మినహా మిగిలిన ఇన్‌స్టిట్యూట్‌లు, విశ్వవిద్యాలయాలు, శిక్షణా కేంద్రాలు ఫిబ్రవరి 1న కార్యకలాపాలను ప్రారంభించవచ్చని ప్ర‌భుత్వం తెలిపింది. కొవిడ్‌ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాలలో వివాహాలకు అనుమతించబడిన అతిథుల సంఖ్య 100కి పరిమితం చేయబడింది. అంత్యక్రియలకు 50కి పరిమితం చేయబడింది.

అన్ని ప్రార్థనా స్థలాలు ప్రతిరోజూ తెరిచి ఉంచడానికి అనుమతినిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. రెస్టారెంట్లు, సెలూన్లు, థియేటర్లు, జిమ్‌లు, యోగా కేంద్రాలు 50% ఆక్యుపెన్సీతో కొనసాగుతాయి. ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలు నిబంధనల ప్రకారం.. సాంస్కృతిక, కమ్యూనిటీ ఈవెంట్‌లు లేదా ప్రదర్శనలకు అనుమ‌తి లేదు. కాగా, గురువారం తమిళనాడులో 28,515 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 32,52,751కి చేరుకుంది. కొత్త‌గా 53 మరణాలు న‌మోదుకాగా.. మరణాల సంఖ్య 37,412కి పెరిగింది. గడిచిన‌ 24 గంటల్లో, 28,620మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 2,13,534 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


Next Story