ఉత్తరప్రదేశ్‌లోని పోలీసు స్టేషన్ లో బీజేపీ నాయకురాలి భర్తను దారుణంగా కొట్టారు. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఈ దాడికి తెగబడ్డాడు. అమేథీ జిల్లాలోని గౌరీగంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నాయకురాలు రష్మీ సింగ్ భర్త దీపక్ సింగ్‌పై సమాజ్‌వాదీ పార్టీ శాసనసభ్యుడు రాకేష్ ప్రతాప్ సింగ్ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాకేష్ ప్రతాప్ సింగ్, అతని మద్దతుదారుల నుండి దీపక్ సింగ్ ను కాపాడడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది.
సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు తెలిపిన వివరాల ప్రకారం, దీపక్ సింగ్ పోలీసు స్టేషన్‌కు వచ్చి అక్కడ నిరసనలో కూర్చున్న సమాజ్ వాదీ నేతలను అసభ్యంగా తిట్టాడు. దీంతో రాకేష్ ప్రతాప్ సింగ్ సహనం కోల్పోయారు. అంతకు ముందు దీపక్ సింగ్, అతని మద్దతుదారులు తన మద్దతుదారులపై దాడి చేశారని, అందుకు తాము నిరసనకు దిగానని చెప్పారు. దీనిపై పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని రాకేష్ ప్రతాప్ సింగ్ అన్నారు. నిరసనల మధ్యే, దీపక్ సింగ్ గౌరీగంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. మరోసారి తిట్టడం మొదలుపెట్టడంతో దీపక్ సింగ్‌పై రాకేష్ ప్రతాప్ సింగ్ చేయి చేసుకున్నారు.