ఇక ఆ కార్డులు కనిపించవేమో..!
RBI restricts Mastercard from onboarding new customers in India. భారత్‌లోని వినియోగదారులకు కొత్త డెబిట్, క్రెడిట్ కార్డులు జారీ
By Medi Samrat Published on 15 July 2021 6:50 PM ISTభారత్‌లోని వినియోగదారులకు కొత్త డెబిట్, క్రెడిట్ కార్డులు జారీ చేయకుండా మాస్టర్ కార్డ్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా నిరవధిక నిషేధం విధించింది. మాస్టర్ కార్డ్ సంస్థ డేటా స్టోరేజ్ చట్టాలను ఉల్లంఘించిందని రిజర్వ్ బ్యాంక్ ఆరోపించింది. ప్రత్యేకంగా భారత్‌లో జరిగే చెల్లింపులకు సంబంధించిన డేటాను నిల్వ చేయడానికి విదేశీ కార్డ్ నెట్‌వర్క్‌లు అనుసరించాల్సిన నిబంధనలను మాస్టర్ కార్డ్ పాటించలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. జులై 22 నుంచి మాస్టర్ కార్డ్ భారత వినియోగదారులకు డెబిట్, క్రెడిట్ లేదా ప్రీపెయిడ్ కార్డులు జారీ చేయకుండా నిషేధించారు. అయితే రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం వల్ల ప్రస్తుతం మాస్టర్ కార్డ్ వినియోగిస్తున్న వారిపై ఎలాంటి ప్రభావం పడదు.
భారతదేశంలో జరిగే చెల్లింపుల డేటాను నిల్వ చేయాలని నిర్దేశిస్తూ 2018లో ఇచ్చిన ఆదేశాలను మాస్టర్ కార్డ్ ఉల్లంఘించిందని ఆర్బీఐ చెప్పింది. ఎన్నో అవకాశాలు ఇచ్చినా డేటా స్టోరేజ్ పేమెంట్‌కు సంబంధించిన ఆదేశాలను మాస్టర్ కార్డ్ పాటించలేదని తాము గుర్తించామని రిజర్వ్ బ్యాంక్ తాజా నోటిఫికేషన్‌లో చెప్పింది. ఈ ఏడాది మొదట్లో ఇలాంటి ఉల్లంఘనలకే పాల్పడిన అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్ కొత్త కార్డులు జారీ చేయకుండా ఆర్బీఐ నిషేధం విధించింది.
జూలై 22వ తేదీ నుండి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఇప్పటికే మాస్టర్ కార్డును వినియోగిస్తున్న వారిపై ప్రభావం ఉండదు. పేమెంట్స్‌కు సంబంధించి డేటాను దేశీయంగా భద్రపరచాలని 2018 ఏప్రిల్ 6వ తేదీన ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు ఆరు నెలల గడువును ఇచ్చింది. గడువు పూర్తైనా నిబంధనలు పాటించడంలో మాస్టర్ కార్డు విఫలమైంది. దీంతో పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ సిస్టమ్స్ చట్టం 2007ను అనుసరించి చర్యలు తీసుకుంది.