దారుణం.. మార్చురీలో ఉన్న మృత‌దేహం క‌న్నుమాయం.. 20 రోజుల వ్య‌వ‌ధిలో రెండో ఘ‌ట‌న‌

Rats suspected to have chewed out eye of dead body kept in MP mortuary.మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jan 2023 6:33 AM GMT
దారుణం.. మార్చురీలో ఉన్న మృత‌దేహం క‌న్నుమాయం.. 20 రోజుల వ్య‌వ‌ధిలో రెండో ఘ‌ట‌న‌

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్ప‌త్రి మార్చురీలో భ‌ద్ర‌ప‌రిచిన‌ మృత‌దేహం క‌న్ను మాయ‌మైంది. 20 రోజుల వ్య‌వ‌ధిలో ఇది రెండో ఘ‌ట‌న కావ‌డం గ‌మ‌నార్హం.

సాగ‌ర్ జిల్లా ఆస్ప‌త్రికి ఈ నెల 16న 108 అంబులెన్స్ ద్వారా 25 ఏళ్ల ర‌మేష్ అనే వ్య‌క్తిని తీసుకువ‌చ్చారు. అత్యంత విష‌మ ప‌రిస్థితుల్లో ఉన్న అత‌డికి వెంటిలేట‌ర్ పై ఉంచి వైద్యం అందిస్తుండ‌గా 17న రాత్రి అత‌డు మ‌ర‌ణించారు. మృత‌దేహాన్ని మార్చురీలో భ‌ద్ర‌ప‌రిచారు. అయితే.. 19వ తేదీ ఉద‌యం చూసే స‌రికి మృత‌దేహాం ఓ క‌న్ను మాయ‌మైంది.

కంటిని ఎలుక‌లు కొరికేశాయ‌ని డాక్ట‌ర్లు అనుమానిస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు కన్ను ఎలా కనిపించకుండా పోయిందనేది నిర్ధారణ కాలేదు. ఈ ఘ‌ట‌న‌పై ఉన్న‌తాధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ విషయాన్ని విచారించేందుకు ఆస్పత్రి యంత్రాంగం ప్రస్తుతం మార్చురీలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తోంది.

దీనిపై రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అభిషేక్ ఠాకూర్ మాట్లాడుతూ మృత‌దేహం కంటిని ఎలుక‌లు కొరికి ఉంటాయ‌ని బావిస్తున్న‌ట్లు చెప్పారు. అయితే దర్యాప్తు పూర్తయిన తర్వాత మాత్రమే అది నిర్ధారించబడుతుందన్నారు.

కాగా.. ఈ నెల 4న ఇదే ఆస్ప‌త్రిలో ఇలాంటి ఘ‌ట‌న‌నే చోటు చేసుకుంది. 32 ఏళ్ల మోతీలాల్ చికిత్స పొందుతూ మ‌ర‌ణించ‌గా.. అత‌డి మృత‌దేహాన్ని మార్చురీలో ఉంచగా అత‌డి క‌న్ను కూడా క‌నిపించ‌కుండా పోయింది. ఇది కూడా ఎలుక‌ల ప‌నే అని అనుమానిస్తున్నారు.

ఆస్ప‌త్రిలో ఎలుక‌ల బెడ‌ద‌పై రోగులు ఆస్ప‌త్రి సిబ్బందిపై ఆగ్ర‌హ్యం వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story