సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశంపై ఇవాళ కీలక ప్రకటన చేయబోతున్నారు. చాలా కాలంగా రజినీకాంత్ రాజకీయాలలోకి ఎంట్రీపై అనేక కథనాలు వెలువడ్డాయి. 2019 లోనే రాజకీయాల్లోకి వస్తారని అనుకున్నారు. కానీ, రాజకీయాల్లోకి రావటానికి ఇంకా సమయం ఉందని, త్వరలోనే అన్ని విషయాలు చెప్తానని గతంలో పేర్కొన్నారు. అయితే.. ఈరోజు ఉదయం రజనీ అభిమాన సంఘాలతో సమావేశం అయ్యారు. స్థానిక రాఘవేంద్ర కల్యాణ మండపంలో మక్కల్ మండ్రం జిల్లా కార్యదర్శులతో సమావేశమయ్యారు.
తమిళనాడు శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రజనీ పార్టీ నిర్వాహకులతో సమావేశమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఆయన కీలక చర్చలు జరుపుతారని ప్రచారం జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉన్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచించుకుంటుండగా రజనీ కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. రజనీ రాయకీయాల్లోకి వచ్చే విషయమై డిసెంబర్ 12న ఆయన పుట్టిన రోజు నాడు కీలక ప్రకటన వెలువడొచ్చనే ప్రచారం ఊపందుకుంది. రోబోయే ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా పోటీ చేస్తారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో #RajinikanthPoliticalEntry అనే హ్యాష్‌ట్యాగ్‌తో అభిమానులు పోస్టులు చేస్తున్నారు.