గుజరాత్ కు చెందిన పర్యాటకుల బృందం రాజస్థాన్ లోని ఒక హోటల్ లో భోజనం చేసిన తర్వాత రూ.10,900 బిల్లు చెల్లించకుండా పారిపోయారు. దీంతో హోటల్ సిబ్బంది సినిమా తరహాలో ఆ టూరిస్టులను వెంబడించారు. రాజస్థాన్ లోని సియావా గ్రామం సమీపంలోని హ్యాపీ డే హోటల్ లో అక్టోబర్ 25న ఈ సంఘటన జరిగింది. హోటల్ సిబ్బంది టూరిస్ట్ బృందాన్ని ఎదుర్కొంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒక మహిళతో సహా ఐదుగురు వ్యక్తులు తమ ప్రయాణంలో భాగంగా హోటల్‌లో ఆగారు. భోజనం ముగించిన తర్వాత, వారు బాత్రూమ్‌కి వెళ్తున్నట్లు నటించారు. అందుకు బదులుగా వారి కారు ఎక్కి డబ్బు చెల్లించకుండా వేగంగా వెళ్లిపోయారు. ఈ మొత్తంసంఘటన హోటల్‌లోని సీసీటీవీ కెమెరాలలో రికార్డైంది, ఆ బృందం గుజరాత్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న వాహనంలో పారిపోతున్నట్లు కనిపించింది. వెంటనే హోటల్ సిబ్బంది, పోలీసు అధికారుల సహాయంతో గుజరాత్ సరిహద్దు సమీపంలో వాహనాన్ని వెంబడించి అడ్డగించారు.