విజయ్‌కు రాహుల్ గాంధీ మద్దతు.. బీజేపీ రియాక్షన్ ఇదే..!
రాజకీయ నాయకుడిగా మారిన నటుడు విజయ్ చంద్రశేఖర్ 'జన నాయకన్' సినిమాపై రాజకీయ దుమారం చెలరేగింది.
By - Medi Samrat |
రాజకీయ నాయకుడిగా మారిన నటుడు విజయ్ చంద్రశేఖర్ 'జన నాయకన్' సినిమాపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ప్రభుత్వం కావాలనే సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో రాహుల్ గాంధీ.. “సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ‘జన నాయకన్’ విడుదలపై విధించిన నిషేధం.. తమిళ సంస్కృతిపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. మిస్టర్ మోడీ.. మీరు తమిళ ప్రజల గొంతును అణచివేయడంలో విజయం సాధించలేరని టార్గెట్ చేశారు.
రాహుల్ గాంధీ చేసిన ఈ ప్రకటన రాజకీయంగా దుమారం రేపింది. రాహుల్ గాంధీ అబద్ధాల కోరు అని బీజేపీ ఫైర్ అయ్యింది. ఈ పోస్ట్‌ను ట్విటర్‌లో పంచుకుంటూ బిజెపి అధికార ప్రతినిధి సిఆర్ కేశవన్ ఇలా వ్రాశారు.. “రాహుల్ గాంధీ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం తమిళ ప్రజల అహంకారం, సంస్కృతి, మనోభావాలను బద్దలు కొట్టింది. జల్లికట్టును అనాగరికంగా అభివర్ణించారు. యూపీఏ ప్రభుత్వం జల్లికట్టును వ్యతిరేకిస్తూ జల్లికట్టును నిషేధిస్తూ నోటీసులు జారీ చేసిందని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు.. ఆయన సహకారం.. కృషి తర్వాత జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయబడింది. రాహుల్ గాంధీ ప్రస్తుత ప్రకటన.. కాంగ్రెస్ పార్టీ ప్రమాదకర ఉద్దేశాలను మరోసారి బట్టబయలు చేసిందని మండిపడ్డారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ సమయంలో ఏం జరిగిందో రాహుల్ గాంధీ చెబుతారా.? కిషోర్ కుమార్ పాటను ఆల్ ఇండియా రేడియోలో ఎలా నిషేధించారు.? ఇందిరాగాంధీ ముందు మోకరిల్లడానికి నిరాకరించినందుకేనా అంటూ ప్రశ్నలు కురిపించారు.