ఆ ఓట్లే బీజేపీని గెలిపించాయి, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.

By Knakam Karthik  Published on  7 Feb 2025 2:30 PM IST
National News, RahulGandhi, Maharashtra, Bjp, Congress,

ఆ ఓట్లే బీజేపీని గెలిపించాయి, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రధాన అధికారిని మార్చారని ఆరోపించారు. మహారాష్ట్రలో ఐదు సంవత్సరాల్లో 32 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారని, మహారాష్ట్ర లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో 39 లక్షల కొత్త ఓటర్లు చేరినట్లు తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో కొత్త ఓటర్లు ఎవరు అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ సంఖ్య హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్యతో సమానమని చెప్పారు. తమకు లోక్ సభలో వచ్చిన ఓట్లకు, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు తేడా లేదని అన్నారు. కానీ ఎన్డీయే కూటమి పార్టీలకు అదనంగా ఓట్లు వచ్చి చేరాయని, ఆ ఓట్లే ఆ పార్టీలకు విజయాన్ని అందించాయని సంచలన ఆరోపణలు చేశారు. తమకు ఓటర్ల జాబితా, వారి ఫొటోలు, చిరునామాలు అందించాలని ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేస్తున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు.

ఇదంతా ఒక ఎత్తయితే.. చాలా చోట్ల దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు చెందిన ఓటర్ల పేర్లను తొలగించారని ఆరోపించారు. పార్లమెంట్‌లో ఈ అంశాన్ని తాను లేవనెత్తినా కూడా ఎన్నికల సంఘం నుంచి సమాధానం రాలేదని అన్నారు. అయితే తాను ఆరోపణలు చేయడం లేదని, గణాంకాలు, డేటాను తమ ముందు పెట్టి సందేహాలను నివృత్తి చేయాలని కోరుతున్నట్లు రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఈసీదే అని స్పష్టం చేశారు.

Next Story