మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా భారతీయ జనతా పార్టీ 400 కంటే ఎక్కువ సీట్లు సాధించడం సాధ్యం కాదని.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం నాడు రాహుల్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 400 సీట్లను దాటడానికి ప్రధానమంత్రి అంపైర్లను ఇప్పటికే ఎంచుకున్నారని ఆయన అన్నారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆప్ ఇండియా కూటమి అగ్రనేతలు ఢిల్లీలో చేపట్టిన 'లోక్తంత్ర బచావో' ర్యాలీలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు, మ్యాచ్ ఫిక్సింగ్, సోషల్ మీడియా, ప్రెస్ మీద ఒత్తిడి లేకుండా బీజేపీ 180 సీట్ల కంటే ఎక్కువ గెలవడం కష్టమేనని అన్నారు.
లోక్‌సభ ఎన్నికలకు అంపైర్లను ప్రధాని మోదీ ఎంపిక చేశారు. మ్యాచ్‌కు ముందే మా జట్టులోని ఇద్దరు ఆటగాళ్లను అరెస్టు చేశారని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ అతిపెద్ద ప్రతిపక్షం.. ఎన్నికల మధ్యలో మా బ్యాంకు ఖాతాలన్నీ మూసివేశారు. మేము ప్రచారాలు నిర్వహించాలి.. కార్యకర్తలను రాష్ట్రాలకు పంపాలి, పోస్టర్లు వేయాలి, కానీ మా బ్యాంకు ఖాతాలన్నీ మూసివేశారు. ఇవి ఎన్నికలా అని రాహుల్ ప్రశ్నించారు. ఈ ఎన్నికలు మామూలు ఎన్నికలు కాదు.. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఈ ఎన్నికలు. మీరు ఓటు వేయకపోతే, వారి మ్యాచ్ ఫిక్సింగ్ విజయవంతమవుతుంది. అది సఫలమైతే రాజ్యాంగం నాశనం అవుతుంది. రాజ్యాంగం ప్రజల గొంతుక.. అది ముగిసిన రోజు దేశం అంతమవుతుందని రాహుల్ గాంధీ అన్నారు.