పార్లమెంటు ఆవరణలో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు మధ్య మాటల యుద్ధం నడిచింది. 'మిత్ర ద్రోహి' అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించగా, 'మీరు దేశ ద్రోహులు' అంటూ కేంద్రమంత్రి కౌంటర్ ఇచ్చారు.
రవ్‌నీత్ సింగ్ బిట్టు మూడుసార్లు ఎంపీగా గెలిచారు. కేంద్ర రైల్వే సహాయ మంత్రిగా పని చేశారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. అదే సమయంలో అటుగా కేంద్రమంత్రి వెళుతున్నారు. ఆయనను ఉద్దేశించి రాహుల్ గాంధీ "ఇదిగో ఒక ద్రోహి నడుచుకుంటూ వెళుతున్నారు, చూడండి" అని అన్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ కేంద్రమంత్రితో కరచాలనం చేయడానికి ముందుకు వస్తూ, "హలో సోదరా, నా మిత్ర ద్రోహి. డోంట్ వర్రీ. మీరు తిరిగి కాంగ్రెస్ లోకే వస్తారు" అని అన్నారు. రాహుల్ గాంధీతో కరచాలనానికి నిరాకరించిన కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు, "మీరు దేశానికి ద్రోహం చేశారు.. మీరు దేశ ద్రోహులు" అని కౌంటర్ ఇచ్చారు.