కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనలో భాగంగా లండన్ లోని ప్రఖ్యాత కేంబ్రిడ్జి యూనివర్సిటీలో మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర చివరలో జమ్మూ కశ్మీర్ లో పాదయాత్ర చేస్తుండగా, ఉగ్రవాదులను అత్యంత దగ్గర నుంచి చూశానని వెల్లడించారు. పాదయాత్ర జమ్మూ కశ్మీర్ చేరుకోగానే, ఇక ముందుకు వెళ్లొద్దని భద్రతా సిబ్బంది సూచించారని, కానీ పార్టీ వర్గాలతో చర్చించిన తర్వాత పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. పాదయాత్ర చేస్తుండగా ఓ కొత్త వ్యక్తి నా వద్దకు వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ నేతలు నిజంగానే కశ్మీర్ కు వచ్చి ప్రజల బాధల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. ఆ తర్వాత కాస్త అవతల నిలబడి ఉన్న కొందరిని చూపించి వాళ్లంతా టెర్రరిస్టులు అని అన్నాడు.. దాంతో నేను సమస్యల్లో చిక్కుకుంటున్నానా అని అనిపించింది. ఆ సమయంలో ఉగ్రవాదులు నన్ను చంపేసేందుకు అవకాశం ఉన్నా అలా చేయలేదు. నా నిబద్ధతను వారు గుర్తించారు. మేం వచ్చింది ప్రజా సమస్యలను వినడానికే అని వారు తెలుసుకున్నారని రాహుల్ గాంధీ అన్నారు.
భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని.. దేశ ప్రజాస్వామ్య ప్రాథమిక నిర్మాణం దాడికి గురవుతోందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు సంస్థాగత నిర్మాణం అవసరమని అన్నారు. భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతూ ఉంటే మేం ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు రాహుల్ గాంధీ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై గూఢచర్యం చేయడానికి పెగాసస్‌ను ఉపయోగించిందని అన్నారు. ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ ను ఉపయోగించి తనపై గూఢచర్యం చేసిందని ఆరోపించారు.