కొత్త పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమం విషయమై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పార్లమెంటు రాజ్యాంగ విలువలతో తయారైందని, అహం అనే ఇటుకలతో కాదని రాహుల్ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత కొత్త పార్లమెంట్ హౌస్ ను ప్రారంభించకపోవడం, ఆమెను వేడుకలకు ఆహ్వానించకపోవడం దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అవమానించడమేనని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
మే 28న పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అయితే విపక్ష పార్టీలు ప్రారంభోత్సవాన్ని సమిష్టిగా బహిష్కరిస్తామని ప్రకటించాయి. ఈ ప్రభుత్వం పార్లమెంటు ప్రజాస్వామ్య స్ఫూర్తిని తొలగించి.. రాష్ట్రపతిని మినహాయించినందున.. పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవాన్ని సమిష్టిగా బహిష్కరిస్తామని ప్రతిపక్షాలకు చెందిన 19 పార్టీలు బుధవారం ప్రకటించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభోత్సవ వేడుకలను దాటవేయడం, కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించడం ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి అని ప్రకటనలో ఆరోపించాయి.