కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి తాజాగా సర్క్యులర్ జారీ అయింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ల ప్రకారం ఆయనపై అనర్హత వేటు అమలు చేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించింది. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళ వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా నెగ్గారు. తాజా నిర్ణయంతో ఆయన ఎంపీగా అర్హత కోల్పోయారు. ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8(3) ప్రకారం ఏదైనా కేసులో రెండేళ్ల కనీస శిక్ష, ఆపై శిక్ష పడితే.. అనర్హత వేటు పడి ఎంపీ పదవీ కోల్పోతారు.
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కర్ణాటక కోలార్ వద్ద జరిగిన ర్యాలీలో ఆయన ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో నీరవ్ మోదీ, లలిత్ మోదీ పేర్లను సైతం ప్రస్తావిస్తూ మోదీ ఇంటి పేరుతో ఉన్నవాళ్లంతా దొంగలే అని అన్నారు. ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ, సూరత్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్‌పై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో నాలుగేళ్ల పాటు వాదనలు కొనసాగాయి.. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది.