ప్రధాని మోదీకి కూడా ఆయనలా మతిమరుపు ఉంది : రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం మహారాష్ట్రలోని అమరావతి బహిరంగ సభలో ప్రసంగించేందుకు వెళ్లారు
By Medi Samrat Published on 16 Nov 2024 7:10 PM ISTకాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం మహారాష్ట్రలోని అమరావతి బహిరంగ సభలో ప్రసంగించేందుకు వెళ్లారు. ఇక్కడ ఆయన ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా టార్గెట్ చేశారు. అంతకుముందు అమరావతికి చేరుకున్న రాహుల్ గాంధీ బ్యాగును ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియా కూటమి నాయకులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు.
రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను గ్రౌండ్‌లో అధికారుల బృందం శోధిస్తున్నప్పుడు.. ఆయన సమీపంలో నిలబడి ఉన్న వీడియో వైరలవుతుంది. బ్యాగ్ చెకింగ్ జరుగుతుండగా.. రాహుల్ పక్కకు వెళ్లి పార్టీ నేతలతో మాట్లాడటం గమనించవచ్చు.
ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి ప్రసంగాలు విపక్షాల ప్రకటనలను పోలి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో పోలుస్తూ.. మోదీ బహుశా జ్ఞాపకశక్తి సమస్యతో బాధపడుతున్నారని సరదాగా అన్నారు.
తన ప్రసంగాల్లో మనం చెప్పే మాటలే చెబుతున్నారని మా సోదరి నాతో చెప్పిందని రాహుల్ అన్నారు. బహుశా మోదీజీ జ్ఞాపకశక్తి కోల్పోయి ఉండవచ్చు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ కూడా ప్రసంగం చేసేటప్పుడు మర్చిపోతుంటారు. ఒకటి చెప్పబోయి.. ఇంకోటి చెబుతారు. అప్పుడు వెనుక నుంచి ఎవరో ఒకరు అలా చెప్పవద్దని చెబుతారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వస్తే.. అమెరికా అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ అని పిలిచారు. ఆయన వెనుక నిలబడిన వ్యక్తులు ఆయన రష్యా నుండి కాదు.. ఉక్రెయిన్ నుండి వచ్చారని గుర్తుచేశారు. ఆయనకు జ్ఞాపకశక్తి తగ్గింది. ఇలా మన ప్రధానికి కూడా జ్ఞాపకశక్తి లేకుండా పోయిందన్నారు.
మా ప్రసంగాలలోని అంశాలను ప్రధాని పునరావృతం చేస్తున్నారు, బహుశా వచ్చే సమావేశంలో సోయాబీన్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 7 వేలు ఇస్తుందని ప్రధాని మోదీ మీకు చెబుతారని అన్నారు. బీజేపీ రాజ్యాంగంపై దాడి చేస్తోందని నేను అన్నాను.. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంపై దాడి చేస్తుందన్నారు. నేను ప్రతి ప్రసంగంలో బీజేపీ దాడి చేస్తుందని ఏడాది కాలంగా చెబుతున్నాను. మోడీ జీకి ప్రజలు కోపంగా ఉన్నారని తెలియగానే.. రాహుల్ గాంధీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని మోడీజీ చెప్పడం ప్రారంభించారని వ్యాఖ్యానించారు.