లోక్ సభ అభ్యర్ధిత్వంపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి లోక్ సభ హౌసింగ్ కమిటీ నోటీసు ఇచ్చింది. రాహుల్ గాంధీ ఇప్పుడు మాజీ ఎంపీ. ఇప్పటివరకు రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ 12, తుగ్లక్ లేన్‌లోని ప్రభుత్వ బంగ్లాలో నివసిస్తున్నారు. నోటీసు ప్రకారం.. ఏప్రిల్ 22లోగా రాహుల్ గాంధీ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది.
మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి 2019లో దాఖలు చేసిన పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కారణంగా రాహుల్ గాంధీ పార్లమెంటు అభ్యర్ధిత్వంపై అనర్హత వేటు పడింది. లోక్‌సభ సభ్యత్వానికి రాహుల్‌గాంధీ అనర్హత వేటును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. ఒడిశా శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నల్ల బట్టలు ధరించి అసెంబ్లీకి హాజరై గందరగోళం సృష్టించారు. దీంతో స్పీకర్ సభా కార్యక్రమాలను సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ సభ్యులు మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. సభ మధ్యలోకి వచ్చారు. ఆర్థిక, హోం, గనుల వంటి ముఖ్యమైన శాఖలపై చర్చ జరగనున్నందున, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ స్థానాల్లోకి వెళ్లాలని అసెంబ్లీ స్పీకర్ బిక్రమ్ కేశరీ అరుఖ్ విజ్ఞప్తి చేశారు.