ఆ అంశంపై ప్రధాని మోదీ స్పందించాలి : రాహుల్ గాంధీ
చైనా కొత్తగా విడుదల చేసిన స్టాండర్డ్ మ్యాప్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.
By Medi Samrat Published on 30 Aug 2023 4:41 PM ISTచైనా కొత్తగా విడుదల చేసిన స్టాండర్డ్ మ్యాప్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. భారత్-చైనా సరిహద్దు వివాదంపై ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. లడఖ్ లోని భూభాగాన్ని చైనా లాక్కోలేదని ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పారని ఆయన ఆరోపించారు. ‘‘లడఖ్ లో ఒక్క అంగుళం భూమి కూడా కోల్పోలేదని ప్రధాని చెప్పింది అబద్ధం. ఈ విషయం నేను చాలా ఏళ్లుగా చెబుతున్నాను. చైనా అతిక్రమణ చేసిందని లడఖ్ మొత్తానికి తెలుసు’’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మ్యాప్ సమస్యను ప్రధాని అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని.. చైనా మన భూమిని లాక్కుందని, దీనిపై ప్రధాని ఏదో ఒకటి మాట్లాడాలని డిమాండ్ చేశారు.
చైనా మరోసారి భారత్ లోని అంతర్భాగాలైన అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలను తమదే అని చెప్పుకుంటూ ‘స్టాండర్డ్ మ్యాపు’ని విడుదల చేసింది. చైనా చర్యలపై భారత్ తీవ్ర అభ్యతరం తెలిపింది. ఇదే కాకుండా తైవాన్, దక్షిణ చైనా సముద్రంలోని జపాన్, వియత్నాం, బ్రూనై దేశాలకు చెందిన ప్రాంతాలను కూడా తన మ్యాపుల్లో కలిపేసుకుంది చైనా. ఇటువంటి చర్యలు సరిహద్దుల్లో పరిస్థితిని క్షిష్టతరం చేస్తాయని భారత్ తెలిపింది. చైనా చర్యలను ఆధారం లేని వాటిగా తిరస్కరించింది. దౌత్యమార్గాల ద్వారా భారత్ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు.