ప్రధాని మోదీతో అదానీకి సంబంధం ఏంటి? : రాహుల్ గాంధీ
Rahul Gandhi accuses PM Modi of favoring Adani Group. లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం
By Medi Samrat Published on 25 March 2023 3:34 PM ISTలోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఇందుకు ఉదాహరణలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. పార్లమెంట్‌లో ప్రధాని మోదీకి, అదానీకి మధ్య ఉన్న సంబంధాలపై నేను ప్రశ్నలు అడిగాను, కానీ నన్ను మాట్లాడనివ్వలేదన్నారు.
భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని నేను చాలాసార్లు చెప్పానని రాహుల్ అన్నారు. రోజుకో కొత్త ఉదాహరణలు వస్తున్నాయి.. పార్లమెంట్‌లో రుజువులు ఇచ్చాను. అదానీ, ప్రధాని మోదీ మధ్య ఉన్న సంబంధాల గురించి మాట్లాడారు. నిబంధనలను మార్చి అదానీకి విమానాశ్రయం ఇచ్చారు. నేను అదానీపై ఒకే ఒక్క ప్రశ్న అడిగాను. నేను ప్రశ్నలు అడగడం కొనసాగిస్తాను.. భారతదేశంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతాను అని రాహుల్ గాంధీ అన్నారు.
“పార్లమెంటులో నా ప్రసంగం తొలగించబడింది.. తరువాత నేను లోక్‌సభ స్పీకర్‌కు వివరణాత్మక సమాధానం రాశాను. నేను విదేశీ శక్తుల సహాయం కోరానని కొందరు మంత్రులు నా గురించి అబద్ధాలు చెప్పారు. కానీ నేను అలాంటిదేమీ చేయలేదు. నేను ప్రశ్నలు అడగడం ఆపను. ప్రధాని మోదీకి, అదానీకి మధ్య ఉన్న సంబంధాన్ని నేను ప్రశ్నిస్తూనే ఉంటాను అని స్పష్టం చేశారు.
నరేంద్ర మోదీతో అదానీకి సంబంధం ఏంటి?’’ అని రాహుల్ ప్రశ్నించారు. నేను ఈ వ్యక్తులకు భయపడను. నా సభ్యత్వాన్ని రద్దు చేసి, బెదిరించి లేదా జైలుకు పంపవచ్చని వారు భావిస్తున్నారు.. కానీ నేను భారతదేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నాను.. పోరాడుతూనే ఉంటానన్నారు. “నాకు నిజం తప్ప వేరే ఆసక్తి లేదు.. నేను నిజం మాత్రమే మాట్లాడతాను.. అది నా పని.. నేను అనర్హతకి గురైనా లేదా అరెస్టైనా.. నేను దానిని కొనసాగిస్తాను. ఈ దేశం నాకు అన్నీ ఇచ్చింది.. అందుకే ఇలా చేస్తున్నానని రాహుల్ అన్నారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “భారత్ జోడో యాత్రలో నా ప్రసంగం ఏదైనా చూడండి. అన్ని సమాజాలు ఒక్కటే అని నేను ఎప్పుడూ అంటున్నాను. ద్వేషం, హింస ఉండకూడదు. ఇది ఓబీసీకి సంబంధించిన విషయం కాదు, నరేంద్ర మోదీకి, అదానీకి మధ్య ఉన్న సంబంధాల వ్యవహారం. బీజేపీ దృష్టి మరల్చడానికి పని చేస్తుంది.. కొన్నిసార్లు ఓబీసీలు అంటారు.. కొన్నిసార్లు విదేశాల గురించి మాట్లాడుతుంటారని రాహుల్ అన్నారు. విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కూడా పాల్గొన్నారు.