ఏంటీ వాహనాల తుక్కు పాలసీ..?
Prime Minister Modi Launches The Voluntary Automotive Scrappage Policy In India. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాలంటరీ వెహికిల్ ఫ్లీట్
By Medi Samrat Published on 13 Aug 2021 5:23 PM ISTభారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాలంటరీ వెహికిల్ ఫ్లీట్ మోడెర్నైజేషన్ ప్రోగ్రామ్ (వాహనాల తుక్కు పాలసీ)ని ప్రారంభించారు. కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాలను తుక్కు కింద మార్చడానికి ముందుకు వచ్చే యజమానులకు ఈ కొత్త విధానం కారణంగా లబ్ధి కలగనుంది. ఈ విధానంలో భాగంగా 15 ఏళ్లు పైబడిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్లు పైబడిన వ్యక్తిగత వాహనాలను తుక్కు కింద మార్చనున్నారు. మొదట ఈ విధానాన్ని ప్రభుత్వ వాహనాలకు అమలు చేయనుండగా.. ఆ తర్వాత భారీ వాణిజ్య వాహనాలు, వ్యక్తిగత వాహనాలకు అమలు చేయనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్న 15 ఏళ్లు పైబడిన వాహనాలను తుక్కుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యక్తిగత వాహనాలను 2024 జూన్ నుంచి తుక్కు చేయనున్నారు.
శుక్రవారం నాడు గుజరాత్‌లో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న మోదీ వాహనాల తుక్కు పాలసీ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ తుక్కు పాలసీ రూ.10 వేల కోట్ల పెట్టుబడులను తీసుకురానున్నట్లు మోదీ చెప్పారు. దేశ అభివృద్ధి ప్రస్థానంలో వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ ఓ గొప్ప మైలురాయి అని చెప్పారు. ఇది చెత్త నుంచి సంపదను సృష్టించే పధకమని తెలిపారు. సరికొత్త స్టార్టప్‌లు ఈ రంగంలో వెలుస్తాయని, ముఖ్యంగా దేశంలో ఉన్న మధ్యతరగతికి ఈ పాలసీ వల్ల మేలు జరుగుతుందన్నారు. కాలుష్యాన్ని తగ్గించే పనిలో భాగంగా కాలపరిమితి నిండిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు తెచ్చిన కొత్త పాలసీలో మెరుగైన అవకాశాలు ఉన్నాయని అన్నారు.
ఇకపై నిరుపయోగంగా ఉన్న వాహనాల్ని దశల వారీగా తగ్గించాలని మోదీ సూచించారు. ఈ పని చేసేందుకు స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేయాలని యువతను ప్రధాని ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఈ తుక్కు పాలసీ కారణంగా ముడి సరుకుల ధరలు 40 శాతం వరకూ తగ్గుతాయని గడ్కరీ అన్నారు. దేశంలో ఎటువంటి వ్యాలిడ్ ఫిట్‌నెస్ లేని వాహనాలు దాదాపు 1 కోటి వరకు ఉన్నాయని.. వాహనం వయసును బట్టి కాకుండా, దాని ఫిట్‌నెస్ ఆధారంగా ఈ స్క్రాపింగ్ పాలసీ వర్తిస్తుందన్నారు.