ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా లోపాలపై రాష్ట్రపతి ఆందోళన
President Kovind to meet PM Modi. ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భద్రతా లోపాలపై
By Medi Samrat Published on 6 Jan 2022 3:35 PM IST
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భద్రతా లోపాలపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేఫథ్యంలో రాష్ట్రపతి కోవింద్.. ప్రధాని మోదీని కలవనున్నారు. ఈ మధ్యాహ్నం ప్రధాని మోదీతో రాష్ట్రపతి భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. పంజాబ్ ఘటనపై కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతి ప్రధాని మోదీతో మాట్లాడి ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై చర్యలకు ఆదేశించే అవకాశం ఉందని సమాచారం. ప్రధాని మోదీ బుధవారం పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ర్యాలీకి వెళుతుండగా.. మార్గంలో నిరసనల కారణంగా రహదారిని బ్లాక్ చేశారు. దీంతో ప్రధాని మోదీ కాన్వాయ్ 15-20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్‌పైనే నిలిచిపోయింది. అనంతరం ర్యాలీని రద్దు చేసుకుని పంజాబ్ నుంచి తిరిగి రావాల్సి వచ్చింది.
ప్రధాని మోదీ కాన్వాయ్ 20 నిమిషాల పాటు ఉన్న మోగా రోడ్‌లో ఆందోళనకారులు ఇప్పటికే క్యాంపులు నిర్వహిస్తున్నారని తనకు తెలియదని సీఎం చన్నీ చెప్పారు. నిరసనకారులకు ప్రధాని మోదీ కార్యకలాపాలు తెలుసు. అయినా వారు ఫ్లై ఓవర్‌ను జామ్ చేసినట్లు పంజాబ్ పోలీసులకు ఎందుకు తెలియదని బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో సీఎం చరణ్‌జీత్ సింగ్ ద్వంద్వ ప్రమాణాలు కూడా కనిపిస్తున్నాయి. కరోనా సోకిన వ్యక్తులతో ఇంటరాక్ట్ అయినందున.. తాను ప్రధాని మోదీని స్వాగతించడానికి వెళ్లలేదని.. అందుకే ఒంటరిగా ఉన్నానని చెప్పారు. అయితే.. బుధవారం సాయంత్రం సీఎం చన్నీ మీడియా సమావేశం నిర్వహించగా, అందులో మాస్కు లేకుండా కనిపించడం గమనార్హం.