ప్రశాంత్ కిషోర్.. ఇన్ని రోజులూ పొలిటికల్ అనలిస్ట్ గా ఉంటూ ఎందరి గెలుపుకో బాటలు వేస్తూ వచ్చారు. ఇక ఈ రోజు ఆయనకు సంబంధించిన ఓ వార్త దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. అదేమిటంటే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్నారని చెప్పడమే..! ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్ళబోతున్నారంటూ నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలతో ప్రశాంత్ కిశోర్ మంగళవారం భేటీ అవ్వడంతో ఈ ప్రచారానికి ఊపు తీసుకుని వచ్చింది.
త్వరలో పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికలు, 2024లో జరగనున్న సాధారణ ఎన్నికలపై వీరు చర్చించారని అంటున్నా.. అంతకు మించి మరేదో ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్ ఆ పార్టీ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఇకపై తాను వ్యూహకర్తగా పని చేయబోనని సంచలన ప్రకటన చేశారు. ఇక గతంలో నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూలో చేరిన ప్రశాంత్ కిశోర్ ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకొచ్చారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లబోతున్నట్టు జరుగుతున్న ప్రచారం ఎంత నిజమో లేదో తెలియాల్సి ఉంది.