మతం గురించి అడిగాడు.. ఫోన్ లో ఏదో మాట్లాడాడు: జమ్మూ కశ్మీర్‌లో అరెస్టు
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత, శుక్రవారం గందర్‌బాల్ జిల్లా పోలీసులు ఒక అనుమానితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత, శుక్రవారం గందర్‌బాల్ జిల్లా పోలీసులు ఒక అనుమానితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఒక పర్యాటకురాలు ఓ వ్యక్తిని చూపిస్తూ అతడు తన మతం గురించి ప్రశ్నించాడని ఆరోపించింది. వేగంగా చర్యలు తీసుకున్న పోలీసులు, నిందితుడిని గందర్‌బాల్‌లోని గోహిపోరా రైజాన్ నివాసి అయిన అయియాజ్ అహ్మద్ జంగల్‌గా గుర్తించారు. అతను సోనామార్గ్‌లోని తజ్వాస్ గ్లేసియర్‌లో పోనీ సర్వీస్ ప్రొవైడర్‌గా పనిచేస్తున్నాడు. నిందితుడు ప్రస్తుతం విచారణలో ఉన్నాడు.
పహల్గామ్ ఉగ్రవాద దాడితో ఈ నిందితుడికి ఏమైనా సంబంధం ఉందా అని పోలీసులు నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పహల్గామ్ దాడి తర్వాత స్కెచ్‌లు విడుదల చేసిన అనుమానిత ఉగ్రవాదులతో తాను మాట్లాడానని ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కు చెందిన ఏక్తా తివారీ తెలిపింది. మెరూన్ జాకెట్, పైజామా ధరించిన వ్యక్తి ఫోటోను తివారీ తన ఫోన్‌లో చూపించి, అతను అనుమానితులలో ఒకడని తెలిపింది. అతను తన మతం గురించి అడిగాడని ఆమె చెప్పింది. అతని పేరు తెలుసా అని అడిగినప్పుడు, తాను అడగలేదని చెప్పింది. ఆ ఫోటో బైసరన్ వ్యాలీలో తీసినట్లు కూడా ఆమె వివరించింది.
ప్రయాణంలో ఉన్న సమయంలో అదే వ్యక్తులు ఆమె పేరు, మతం గురించి అడిగారు. తర్వాత వారు ఆమెను ఎప్పుడైనా అజ్మీర్ దర్గా లేదా అమర్‌నాథ్‌ను సందర్శించారా అని అడిగారు. తాను సందర్శించలేదని తివారీ వారికి చెప్పింది. వారిలో ఒకరు హిందూ మతాన్ని ఇష్టపడుతున్నారా లేదా ఇస్లాంను ఇష్టపడుతున్నారా అని అడిగారని ఏక్తా తివారీ తెలిపింది. ఆమె రెండు మతాలను ఇష్టపడుతూ ఉన్నానని సమాధానం చెప్పినప్పుడు, ఆ వ్యక్తి మీకు ఎంత మంది హిందూ, ముస్లిం స్నేహితులు ఉన్నారని కూడా అడిగారని వివరించింది. అంతేకాకుండా ఖురాన్ చదివారా అని అడిగారని, తనకు ఉర్దూ తెలియకపోవడంతో తాను చదవలేదని ఆమె చెప్పింది. ఖురాన్ హిందీలో కూడా అందుబాటులో ఉందని అతను బదులిచ్చాడు. ఆ సమయంలో తనకు భయంగా అనిపించడం ప్రారంభించిందని ఏక్తా తివారీ చెప్పింది. తరువాత, ఆ వ్యక్తికి ఫోన్ కాల్ వచ్చింది. "ప్లాన్ ఎ బ్రేక్ ఫెయిల్, ప్లాన్ బి 35 తుపాకులు పంపి లోయలోని గడ్డిపై ఉంచారు" అని అతను చెప్పినట్లు తాను విన్నానని ఏక్తా తివారీ చెప్పింది. వారిని గమనిస్తున్నట్లు గమనించిన ఆ వ్యక్తి వేరే భాషలో మాట్లాడడం మొదలుపెట్టాడని ఏక్తా తివారీ సంచలన విషయాలను బయటపెట్టింది.