అమరావతిలో కర్ఫ్యూ.. బంద్‌లో చెలరేగిన హింస.!
Police impose curfew in Amravati . ఇటీవల ఈశాన్య రాష్ట్రం త్రిపురలో చెలరేగిన హింస మహారాష్ట్ర రాష్ట్రంలో చిచ్చపెట్టింది. త్రిపురలో జరిగిన హింసను ఖండిస్తూ
By అంజి Published on 14 Nov 2021 2:42 AM GMTఇటీవల ఈశాన్య రాష్ట్రం త్రిపురలో చెలరేగిన హింస మహారాష్ట్ర రాష్ట్రంలో చిచ్చపెట్టింది. త్రిపురలో జరిగిన హింసను ఖండిస్తూ కొన్ని ముస్లిం వర్గాలు శుక్రవారం నాడు ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే శనివారం నాడు దానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు బంద్‌కు పిలపునివ్వడంతో దుకాణాలపై రాళ్లు రువ్వడం వంటి హింసాత్మక ఘటనలు జరిగాయి. అమరావతి, నాందేడ్, వషీం, మాలేగావ్, యావత్మాల్ జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. ఈ ఘటన పోలీసులు లాఠీఛార్జ్ చేసి 20 మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. వారిపై వివిధ అభియోగాలతో కేసులు ఫైల్ చేశారు.
మాలేగావ్ జిల్లాలో జరిగిన అల్లర్లలో 10 మంది పోలీసుల గాయపడ్డారు. పోలీసుల వాహనంపై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే అమరావతి నగరంలో కర్ఫ్యూ ప్రకటించారు. ఇది తిరిగి తెలిపే వరకు అమలులో ఉంటుంది. ఇంటర్‌నెట్ సేవలను కూడా నిలిపివేశారు. వరుసగా రెండ్రోజుల పాటు రాళ్లు రువ్వుకున్న ఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసు ఉన్నతాధికారులు కర్ఫ్యూ విధించారు. మెడికల్ అవసరాలకు కోసం తప్పిస్తే ప్రజలెవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దొని పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఇది మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర అని అన్నారు. కావాలనే పలు ప్రాంతాల్లో హింసకు పాల్పడుతున్నారని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి ఆరోపణలు చేశారు. అల్లర్లకు కారణమైన వారి బండారాన్ని బయట పెడతామని చెప్పారు. అయితే ఈశాన్య రాష్ట్రం త్రిపురలో ఒక ప్రార్థన స్థలానికి వేరే వర్గం వారు నష్టం కలిగించినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని కేంద్రం ప్రభుత్వం తెలిపింది. ప్రజలందరూ సంయమనం పాటించాలని.. త్రిపురలో అలాంటి ఏ ఘటనలోనూ ఎవరికీ గాయాలు కాలేదని కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది.