ప్రధాని నరేంద్ర మోదీ నేడు పంజాబ్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రాష్ట్రంలో రూ.42,750 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన కీలకంగా మారింది. పర్యటనలో మోదీ రాష్ట్రానికి సంబంధించి కొన్ని పెద్ద ప్రకటనలు చేసే అవకాశం ఉంది. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ప్రధాని మోదీ పంజాబ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఢిల్లీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్న ఎక్కువ మంది రైతులు పంజాబ్‌కు చెందినవారే.
ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్‌వే, అమృత్‌సర్-ఉనా సెక్షన్‌ను నాలుగు లేన్‌లుగా మార్చడం, ముకేరియన్-తల్వారా కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే లైన్‌కు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఫిరోజ్‌పూర్‌లో PGI ఉపగ్రహ కేంద్రం, కపుర్తలా, హోషియార్‌పూర్‌లో రెండు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. దేశవ్యాప్తంగా కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా.. పంజాబ్‌లో అనేక జాతీయ రహదారులను కూడా అభివృద్ధి చేసినట్లు PMO తెలిపింది. దీనిప్రకారం.. 2014లో రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవు 1,700 కి.మీ ఉండగా.. 2021 నాటికి 4,100 కి.మీలకు పెరిగింది. అందులో బాగంగానే పంజాబ్ లో రెండు ప్రధాన రహదారి కారిడార్‌లకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని పీఎంవో తెలిపింది.