ఫ‌లించిన రైతుల‌ పోరాటం.. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు మోదీ కీలక ప్రకటన

PM Says 3 Farm Laws To Be Cancelled. ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను

By Medi Samrat  Published on  19 Nov 2021 4:19 AM GMT
ఫ‌లించిన రైతుల‌ పోరాటం.. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు మోదీ కీలక ప్రకటన

ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గురునానక్​ జయంతి సందర్భంగా శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేశారు. రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసమే వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని.. కానీ రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో వాటిని వెనక్కి తీసుకుంటున్నామని ప్రధాని మోదీ చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించడం కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కొత్త వ్య‌వ‌సాయ‌ చట్టాల విషయంలో కొందరు రైతులను ఒప్పించడంలో మేం విఫలమయ్యాం. కొత్త చట్టాల వల్ల కలిగే ప్రయోజనాల గురించే రైతులకు అన్ని రకాలుగా వివరించాం. రైతులతో ఎన్నో సార్లు చర్చించాం. వారిని ఒప్పించేందుకు ప్రయత్నించాం. గత రెండేళ్లలో ఎన్నో జరిగాయి. రైతులకు కలిగిన ఇబ్బందులకు గాను నేను క్షమాపణ చెబుతున్నా. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించాం. ఈ శీతకాల సమావేశాల్లోనే దానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.

ఇక ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచింద‌ని.. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకుచ్చామని తెలిపారు. రైతు మార్కెట్ల అభివృద్ధి, విస్తరణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. పొలంలో పనిచేసే చిన్న రైతుల కోసం కూడా బీమా సదుపాయం కల్పించామన్నారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బును జమ చేశామన్నారు. తక్కువ ధరకే విత్తనాలు విక్రయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గురునానక్ జ‌యంతి సందర్భంగా మీ అందరికీ నా విజ్ఞప్తి. ఆందోళన చేస్తున్న వారంతా తిరిగి ఇళ్లకు వెళ్లి కుటుంబాలతో గడపండి. పొలాల్లోకి దిగి తిరిగి వ్యవసాయ పనులను ప్రారంభించండని మోదీ రైతుల‌నుద్దేశించి వ్యాఖ్యానించారు.



Next Story