ఇండియా కూటమిపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభలో చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on  5 Feb 2024 9:00 PM IST
ఇండియా కూటమిపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభలో చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమిదే విజయం అని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 370కి పైగా సీట్లు వస్తాయని అన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక ఇంకా సంచలన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. బీజేపీపై పోటీ చేయడానికి విపక్షాలు భయపడుతున్నాయని.. కొంతమంది పోటీ చేసే స్థానాలు మార్చుకుంటున్నారని, ఈసారి కొందరు రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రజలు బుద్ధి చెప్పినా విపక్షాలు ఇప్పటికీ తీరు మార్చుకోవడంలేదని మోదీ విమర్శించారు. మైనారిటీల పేరిట విపక్షాలు ఎంతకాలం రాజకీయాలు చేస్తాయి.. ఎంతకాలం ఇలా విభజన రాజకీయాలు చేస్తారని నిలదీశారు. ఎన్నికలు వస్తున్నాయి.. ఇప్పుడైనా కష్టపడండని చురక అంటించారు.

కాంగ్రెస్ నేతలు కొత్త దుకాణాలు తెరుస్తున్నారని, కాంగ్రెస్ ఒకే ప్రొడక్ట్ ను మాటిమాటికీ లాంచ్ చేస్తోందని రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 2014లో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకువచ్చామని వెల్లడించారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరు ఏం అనుకున్నా హ్యాట్రిక్ విజయం సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ సాధిస్తున్న విజయాలను కాంగ్రెస్ తక్కువ చేసి చూపుతోందని, తాము ఏ పథకం అమలు చేసినా రద్దు చేస్తామంటోందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయులు కష్టపడరని ఎర్రకోట సాక్షిగా ఆనాడు నెహ్రూ చెప్పారని మోదీ వెల్లడించారు. అమెరికా, చైనా, జపాన్, రష్యా పౌరులతో పోల్చుతూ భారత ప్రజల నైపుణ్యం తక్కువ అని చెప్పారని వివరించారు. కాంగ్రెస్ ఇప్పటికీ దేశ ప్రజలను తక్కువగా అంచనా వేస్తోందని, దేశ సామర్థ్యం మీద కాంగ్రెస్ కు నమ్మకం లేదని విమర్శించారు. ఇండియా కూటమి పేరుతో కాంగ్రెస్ హంగామా చేసిందని మోదీ ఎద్దేవా చేశారు. ఆ కూటమిలో నేతలకు ఒకరిపై ఒకరికి నమ్మకం లేదని, అందుకే కూటమి కుప్పకూలిందని అన్నారు. ఇలాంటి నేతలను ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. మరో వంద రోజుల్లో తమ ప్రభుత్వం మూడోసారి ఏర్పడబోతోందని ధీమా వ్యక్తం చేశారు. తమ పాలనను ప్రజలు వెయ్యేళ్లకుపైగా గుర్తుంచుకుంటారని అన్నారు.

Next Story