అమ్మకానికి ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం.. షాకైన పోలీసులు
PM Modi's Varanasi office offered for sale on OLX. వాడేసిన వస్తువులను అమ్మేసే ఓఎల్ఎక్స్ మరోసారి వార్తల్లో నిలిచింది.
By Medi Samrat Published on 18 Dec 2020 10:56 AM GMT
వాడేసిన వస్తువులను అమ్మేసే ఓఎల్ఎక్స్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఎన్నో సార్లు ఫేక్ ప్రకటనలతో విమర్శలెదురుకుంటుంది ఈ సంస్థ. తాజాగా సదరు సంస్థ ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన ప్రకటన చూసి సాక్షాత్తు పోలీసులే ఆశ్చర్యపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టినట్లు ఓఎల్ఎక్స్‌లో ప్రకటన వచ్చిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా అవాక్కయ్యారు.
ప్రస్తుతం మోదీ వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారణాసిలోని గురుధామ్ కాలనీలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయాన్ని అమ్ముతున్నట్లు క్లాసిఫైడ్స్ వెబ్‌సైట్ ఓఎల్ఎక్స్‌లో ప్రచురితమైన ప్రకటనపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మోదీ కార్యాలయం వివరాలు, ఫొటోలను ప్రచురిస్తూ.. దీనిని రూ.7.5 కోట్లకు అమ్ముతామని ప్రకటనదారులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రకటనను వెంటనే తొలగించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
వారణాసిలోని మోదీ కార్యాలయం ఓ విల్లాలో ఉంది. ఓఎల్ఎక్స్‌లో ఇచ్చిన ప్రకటనలో 6,500 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాగల ఈ విల్లాలో 4 గదులు, 4 బాత్రూములు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈశాన్య ముఖ ద్వారం ఉన్న ఈ ఇంట్లో రెండు అంతస్థులు ఉన్నాయని, కార్ పార్కింగ్ కూడా ఉందని పేర్కొన్నారు. పోలీసులు వెంటనే ఈ ప్రకటనను తొలగింపజేశారు. దీనికి బాధ్యులైన నలుగుర్ని గుర్తించి, అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.