టెక్నాలజీ కారణంగా ఎంత మంచి జరుగుతుందో అంతకంటే ఎక్కువ చెడు కూడా జరిగే ప్రమాదం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను మరోసారి హెచ్చరించారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా విద్యార్థులతో ప్రధాని మోదీ మాట్లాడారు. కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. సోషల్ మీడియాలో డీప్‌ఫేక్ వీడియోలతో చాలా సమస్యలు వస్తాయని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన వీడియోలు, చిత్రాలు చాలా వరకూ నిజమైనవిగా కనిపిస్తున్నాయన్నారు. కొత్త టెక్నాలజీతో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. కొత్త సాంకేతికతని జాగ్రత్తగా ఉపయోగిస్తే.. అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే వీటిని దుర్వినియోగం చేస్తే, అది మనం ఊహించని సమస్యలను సృష్టిస్తాయన్నారు ప్రధాని మోదీ.
గతంలో కూడా ప్రధాని మోదీ సోషల్ మీడియాలో డీప్‌ఫేక్‌ల గురించి మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో గ్లోబల్ రెగ్యులేషన్స్ తప్పనిసరిగా ఉండాలని ఆయన ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. AI సమాజానికి ఉపయోగపడేలా మాత్రమే ఉండాలని అన్నారు. ఆయన హెచ్చరించినట్లుగానే దేశంలోని పలువురు ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.