రైతులకు గుడ్‌న్యూస్..రేపు పీఎం కిసాన్ నిధులు రిలీజ్ చేయనున్న ప్రధాని మోదీ
దేశవ్యాప్తంగా 9 కోట్లు మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల విలువైన 21వ విడత PM-KISAN నిధులను విడుదల చేస్తారు.
By - Knakam Karthik |
రైతులకు గుడ్‌న్యూస్..రేపు పీఎం కిసాన్ నిధులు రిలీజ్ చేయనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 19న ఆంధ్రప్రదేశ్, తమిళనాడును సందర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన పుట్టపర్తి చేరుకుని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా యొక్క మహాసమాధి వద్ద ప్రార్థనలు చేసేందుకు, నివాళులు అర్పించేందుకు హాజరుకానున్నారు. అనంతరం ఉదయం 10.30కి జరిగే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి కార్యక్రమంలో పాల్గొని, బాబా జీవితం, బోధనలు, సేవా పరంపరను ప్రతిబింబించే స్మారక నాణెం, పోస్టల్ స్టాంపులను విడుదల చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
తరువాత ప్రధాని తమిళనాడులోని కోయంబత్తూరుకు చేరుకుని మధ్యాహ్నం 1.30 గంటలకు సౌత్ ఇండియా నేచురల్ ఫార్మింగ్ సమ్మిట్‌ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 9 కోట్లు మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల విలువైన 21వ విడత PM-KISAN నిధులను విడుదల చేస్తారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న రైతుల్ని ఉద్దేశించి మాట్లాడతారు.
సమ్మిట్ ముఖ్యాంశాలు:
నవంబర్ 19 నుంచి 21 వరకు జరిగే ఈ సమ్మిట్‌ను తమిళనాడు నేచురల్ ఫార్మింగ్ స్టేక్‌హోల్డర్స్ ఫోరం నిర్వహిస్తున్నది. సహజ వ్యవసాయం, రసాయనరహిత పద్ధతులు, వాతావరణ అనుకూల వ్యవసాయం, ఆర్థికంగా లాభదాయకమైన పునరుత్పాదక వ్యవసాయ నమూనాలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ సమ్మిట్ జరుగుతోంది. అలాగే రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOs), గ్రామీణ పారిశ్రామికవేత్తలకు మార్కెట్ అనుసంధానాలు కల్పించడం, సేంద్రీయ ఇన్‌పుట్లు, వ్యవసాయ ప్రాసెసింగ్, పర్యావరణ–హిత ప్యాకేజింగ్, స్థానిక సాంకేతికతలు వంటి అంశాల్లో ఆవిష్కరణలను ప్రదర్శించనున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల నుండి సహా 50,000 మందికి పైగా రైతులు, నేచురల్ ఫార్మింగ్ నిపుణులు, శాస్త్రవేత్తలు, సంస్థలు పాల్గొననున్నారు.