భారతదేశంలో నగదు రహిత లావాదేవీలు భారీగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే..! డిజిటల్ ఇండియా లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నగదు రహిత చెల్లింపుల కోసం కొత్తగా పేమెంట్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. నేడు ప్రధాని నరేంద్ర మోదీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ-రూపీ (E- Rupi) డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించనున్నారు. డిజిటల్ లావాదేవీల కోసం ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పే, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులు, అమెజాన్ పే, పేటీఎంతో పాటు చాలానే ఉన్నాయి. తాజాగా నగదు రహిత లావాదేవీల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ-రూపీ విధానాన్ని అందుబాటులో తీసుకువస్తోంది.
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. కేంద్ర ఆర్థిక సేవలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సాయంతో ఈ-రూపీ రూపకల్పన ఈ కొత్త విధానాన్ని రూపొందించింది. నగదు చెల్లింపులను క్యూ ఆర్ కోడ్, ఎస్ఎంఎస్ స్ట్రింగ్ వోచర్ ద్వారా లబ్దిదారుడి మొబైల్ ఫోన్‌కు పంపిస్తారు. ఈ వోచర్, క్యూఆర్ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైనచోట వినియోగించుకోవచ్చు. డిజిటల్ లావాదేవీల్ని మరింత వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా కేంద్రం ఈ-రూపీని తీసుకువస్తున్నది. ఈ కొత్త విధానం తొలిదశలో కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందే లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలతో సంబంధం లేకుండానే ప్రభుత్వ సహాయం అందనుంది. మొబైల్ ఫోన్‌కు క్యూఆర్ కోడ్, ఎస్‌ఎంఎస్ వోచర్ రూపంలో నగదు చేరుతుంది. వాటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది.