రేపే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం
PM Modi to launch COVID-19 vaccination drive on January 16. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ జనవరి 16న మొదలుకానుంది.
By Medi Samrat Published on 15 Jan 2021 9:07 AM ISTదేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ జనవరి 16న మొదలుకానుంది. ప్రధాని మోదీ ఆన్‌లైన్ ద్వారా వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తంగా 3,006 ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ మొదలు కానుంది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో వంద మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ వర్కర్స్, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కొవిన్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ పరిశీలన జరగనుంది. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అధికారులు పర్యవేక్షించనున్నారు. ఈ నిరంతర ప్రక్రియకు కేంద్రం ప్రత్యేక కాల్‌సెంటర్ ఏర్పాటు చేసింది.
ఇక ప్రస్తుతం వైద్య సిబ్బంది, పారిశుద్ధ్యం, పోలీసులు తదితర విభాగాల సిబ్బందికి టీకా వేస్తారు. ఆ తర్వాత 50 ఏండ్లు దాటినవారికి, అనంతరం 18- 50 ఏండ్ల మధ్య వయసు ఉండి, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారికి టీకా ఇవ్వనున్నారు. చివరి దశలో మిగతా ప్రజలకు అందజేస్తారు. కరోనా నుంచి కోలుకున్నవారు 90 రోజులపాటు ఎలాంటి టీకా వేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికే వారి శరీరంలో యాంటీబాడీస్ ఉంటాయి.. కాబట్టి వైరస్ సోకకుండా అడ్డుకుంటాయి. కనుక టీకా వేసుకోవాలో వద్దో వారే నిర్ణయించుకోవాలి.
ఇదిలావుంటే.. ఇప్పటికే అన్ని దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొని వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఔషధ నియంత్రణ మండలి, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతే టీకా వినియోగానికి అనుమతి ఇచ్చాయి. కాబట్టి టీకా సైడ్ ఎఫెక్ట్స్ వంటి ఎలాంటి ఆందోళన అవసరం లేదని అంటారు. ఇక జలుబు, దగ్గు వంటి సాధారణ లక్షణాలున్నా టీకా వేస్తారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నవారికి టీకా వేయరు. అవయవ మార్పిడి చేసుకున్నవారికి ఎప్పటికీ టీకా వేయరు. కొవిడ్ వ్యాక్సిన్‌ను విడుదల చేసే సమయంలో పూర్తి మార్గదర్శకాలు అందుబాటులోకి వస్తాయి.