అక్టోబర్ 1న న్యూఢిల్లీలో జరిగే 'ఇండియా మొబైల్ కాంగ్రెస్' ఆరవ ఎడిషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశంలో 5Gని అధికారికంగా ప్రారంభించనున్నారు. PMO నోటీసు ప్రకారం, ప్రధానమంత్రి ప్రగతి మైదాన్‌లో ఉదయం 10 గంటలకు తన ప్రసంగంతో నాలుగు రోజుల ఈవెంట్‌ను ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం థీమ్ 'న్యూ డిజిటల్ యూనివర్స్' గా నిర్వాహకులు తెలిపారు. ఈ ఈవెంట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా వ్యాప్తి చేయడం, అవకాశాల గురించి చర్చించడానికి, ప్రదర్శించడానికి.. వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు, ప్రభుత్వ అధికారులను ఒకచోట చేర్చుతుంది.
5G ప్రకటన సమయానికి వేదికపై ప్రధాని మోదీతో పాటు రిలయన్స్ ముఖేష్ అంబానీ, ఎయిర్‌టెల్ యొక్క సునీల్ మిట్టల్, Vi ఇండియా హెడ్ రవీందర్ టక్కర్ వంటి ప్రముఖులు పాల్గొంటారని ఒక నివేదిక పేర్కొంది. ఇక 5G ప్లాన్‌ల గురించి వివరాలు కొంతకాలం తర్వాత విడుదలచేస్తారు. డిజిటల్ ఇండియా విజన్ పై ఇప్పటికే పలుమార్లు ప్రధాని మోదీ చెబుతూ వస్తున్నారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రసంగంలో 5G గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుత 4G కంటే పది రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ ను అందిస్తుందని ఆయన చెప్పారు. భారతీయ గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ అందుబాటులో ఉంటుందని.. త్వరలో ఇంటర్నెట్ దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరుకుంటుందని చెప్పుకొచ్చారు.