ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. సుమారు 35 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య సంభాషణ కొనసాగింది. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై ఇరు నేతలు చర్చినట్లు తెలుస్తోంది. రష్యాతో ఓ వైపు పోరు కొనసాగిస్తూనే.. నేరుగా చర్చల నిర్ణయం తీసుకోవడంపై జెలెన్‌స్కీని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అభినందించారు. ఇక ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో అందించిన సాయానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఇంకా కొందరు భారతీయ పౌరులు ఉక్రెయిన్‌లో ఉన్నారు. రష్యా కాల్పుల విరమణ ప్రకటించిన నేపథ్యంలో సుమీ నుంచి మిగతా భారతీయుల తరలింపునకు సహకారం అందించాలని ప్రధాని కోరారు. దౌత్య మార్గాల్లో సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రధాని సూచించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా మోదీ ఫోన్‌లో మాట్లాడనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.