భారత ప్రధాని మోదీ స్వదేశానికి తిరిగొచ్చారు. మూడు రోజుల అమెరికా పర్యటన ముగించుకున్న ఆయన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగారు. ఎంతో బిజీ షెడ్యూల్ ముగించుకొని స్వదేశానికి తిరిగొచ్చిన ప్రధానికి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు మరికొంత మంది పార్టీ నేతలు మోదీకి స్వాగతం పలికారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన 65 గంటల్లో 20కి పైగా సమావేశాలకు హాజరయ్యారు. మొత్తం 65 గంటల్లో అమెరికా గడ్డపై 20 సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. విమానంలోనూ ఆయన నాలుగు మీటింగ్స్‌లో పాల్గొనడంతో మొత్తం సమావేశాల సంఖ్య 24కు చేరినట్లు మీడియా సంస్థలు తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సహా పలువురు కీలక నేతలతో ఆయన సమావేశమయ్యారు. క్వాడ్ సదస్సులో కూడా పాల్గొన్నారు.
సెప్టెంబర్ 22న మోదీ ప్రయాణం మొదలైంది. విమానంలో ప్రధాని మోదీ రెండు సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత వాషింగ్టన్‌లో దిగిన వెంటనే మరో మూడు భేటీలు జరిగాయి. 23న అమెరికాలోని ఐదు కంపెనీల సీఈవోలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడె సుగాతోనూ మోదీ సమావేశమయ్యారు. ఆ తర్వాత తన అంతర్గత టీమ్‌తో మోదీ మరో మూడు సమావేశాలు నిర్వహించారు. 24న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోపాటు క్వాడ్ సమావేశంలో పాల్గొనే ముందు మరో నాలుగు అంతర్గత సమావేశాల్లో మోదీ పాల్గొన్నారు. ఈ నెల 25న ఇండియాకు తిరిగి రావడానికి విమానంలో ఎక్కిన ఆయన మరో రెండు సుదీర్ఘ సమావేశాల్లో పాల్గొన్నారు.