గుడ్‌న్యూస్.. రైతుల బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేసిన ప్రధాని
కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.
By Medi Samrat Published on 24 Feb 2025 4:30 PM IST
కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. బీహార్‌లోని భగల్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో 9.8 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు 22,000 కోట్ల రూపాయలను ప్రధాన మంత్రి బదిలీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ,.. ఈ బాబా అజ్‌గైబినాథ్ పుణ్య భూమిలో కూడా మహాశివరాత్రికి సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి పవిత్ర సమయంలో దేశంలోని కోట్లాది మంది రైతులకు పీఎం కిసాన్ నిధిని మరో విడత పంపడం నాకే దక్కిందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి ఒక్క క్లిక్‌తో దాదాపు రూ.22 వేల కోట్లు చేరాయి.
వికసిత్ భారత్‌కు నాలుగు బలమైన స్తంభాలు ఉన్నాయని ఎర్రకోటపై నుంచి నేను చెప్పానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ స్తంభాలు- పేదలు, రైతులు, మహిళలు, యువత. కేంద్రంలో అయినా, రాష్ట్రంలో అయినా ఎన్డీయే ప్రభుత్వం రైతుల సంక్షేమమే మా ప్రాధాన్యత అన్నారు.
మహాకుంభ సమయంలో ఈ మందరాచల్ భూమికి రావడం గొప్ప అదృష్టమని ప్రధాని అన్నారు. ఈ భూమి, వారసత్వం, వికసిత్ భారత్ యొక్క సంభావ్యతపై విశ్వాసం ఉంది. ఇది అమరవీరుడు తిల్కా మాంఝీ పుట్టిన భూమి, సిల్క్ సిటీ కూడా అని పేర్కొన్నారు.
వేదికపై ప్రధాని మోదీతో పాటు బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఎంపీ గిరిరాజ్ సింగ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ, బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్, బీహార్ ప్రభుత్వ మంత్రి మంగళ్ పాండే ఉన్నారు.