ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ (100) ఆరోగ్య సమస్యలతో బుధవారం ఆస్పత్రిలో చేరారు. అహ్మదాబాద్ లోని ఆస్పత్రిలో ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని యుఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ అధికారులు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు ప్రధాని మోదీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అండగా నిలిచారు. ట్విట్టర్ ద్వారా రాహుల్ స్పందిస్తూ తల్లీకొడుకుల మధ్య అనుబంధం అన్నిటికీ అతీతమైనదని, వెలకట్టలేనిదని చెప్పారు. మోదీ గారూ, ఈ కష్ట సమయంలో మీకు నా ప్రేమ, మద్దతు వుంటాయని అన్నారు. మీ మాతృమూర్తి త్వరగా కోలుకుంటారని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు.
ఈ ఏడాది జూన్‌లో హీరాబెన్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 18న గాంధీనగర్‌లో తన తల్లి 100వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ తన తల్లి కాళ్లు కడిగి ఆశీస్సులు తీసుకున్నారు. ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని వాద్‌నగర్‌లోని హట్‌కేశ్వర్ ఆలయంలో పూజలు కూడా జరిగాయి.