ప్రధాని నరేంద్ర మోదీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదట..!
PM Modi Most Searched Indian Personality of the year. ఇంటర్నెట్లో ఎక్కువగా సెర్చ్ చేసే భారతీయుల్లో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే మొదటి స్థానంలో
By Medi Samrat Published on 3 Dec 2021 7:49 PM ISTఇంటర్నెట్లో ఎక్కువగా సెర్చ్ చేసే భారతీయుల్లో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. ప్రముఖ సెర్చ్ ఇంజన్ యాహూ 2021 ముగియనున్న నేపథ్యంలో దేశంలో ఎక్కువ మంది నెటిజన్లు వెతికిన వ్యక్తుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు. 2017 నుంచి క్రమం తప్పకుండా మోదీ మొదటి స్థానంలో ఉన్నారు. గతేడాది మాత్రం దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మొదటి స్థానంలో నిలిచారు. యాహూ విడుదల చేసిన జాబితాలో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మూడో స్థానంలో నిలిచారు. ఇటీవల గుండె పోటుతో హఠాన్మరణం పొందిన బాలీవుడ్ ప్రముఖ టీవీ యాక్టర్ సిద్ధార్థ్ శుక్లా నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి, అనంతరం విడుదలైన షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఈ ఏడాది ఎక్కువ సెర్చ్ చేసిన వారి జాబితాలో 7వ స్థానంలో నిలిచారు.
2021లో భారతదేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన పురుష సెలబ్రిటీ టైటిల్‌ను ఇటీవల మరణించిన సిద్ధార్థ్ శుక్లా కైవసం చేసుకున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, తెలుగు నటుడు అల్లు అర్జున్ వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచారు. దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ సెలబ్రిటీల జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచారు. పునీత్ మరణం దక్షిణాది సినీ ప్రపంచానికే షాకింగ్ విషయం. 5వ స్థానంలో దివంగత దిలీప్ కుమార్ ఉన్నారు. ఆయన 98 సంవత్సరాల వయస్సులో ఈ ఏడాది మరణించారు. బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ 2021లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన మహిళా సెలబ్రిటీగా నిలిచారు. కత్రినా కైఫ్ 2వ స్థానంలో, ప్రియాంక చోప్రా జోనాస్ మూడో స్థానంలో ఉండగా, అలియా భట్ నాలుగో స్థానంలో, దీపికా పదుకొణె 5వ స్థానంలో నిలిచారు.