ఇక‌పై వైద్య పర్యాటకుల కోసం ఆయుష్ వీసా

PM Modi launches Ayush Visa for medical tourists. మెడికల్ టూరిజం లేదా చికిత్స కోసం భారతదేశాన్ని సందర్శించే పర్యాటకుల కోసం ప్రత్యేక కేటగిరీ

By Medi Samrat  Published on  20 April 2022 3:43 PM IST
ఇక‌పై వైద్య పర్యాటకుల కోసం ఆయుష్ వీసా

మెడికల్ టూరిజం లేదా చికిత్స కోసం భారతదేశాన్ని సందర్శించే పర్యాటకుల కోసం ప్రత్యేక కేటగిరీ ఆయుష్ వీసాను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. నాణ్యమైన ఉత్పత్తులను గుర్తించి వాటికి గుర్తింపునిచ్చేందుకు ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ద్వారా ఆయుష్‌ ఉత్పత్తులకు ప్రత్యేక హాల్‌మార్క్‌ రకం బ్రాండింగ్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో మూడు రోజుల గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2022 ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడారు.

"మెడికల్ టూరిజం కోసం భారతదేశం చాలా ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఉంది. వైద్య పరిశ్రమ కారణంగా కేరళ టూరిజం పెరుగుదలకు మేం సాక్ష్యమిచ్చాం. ఇదే త‌ర‌హాలో దేశవ్యాప్తంగా కూడా చేయవచ్చు. ఇక్కడ ఆయుర్వేదం, యునాని, సిద్ధ రూపాలైన సాంప్రదాయ ఔషధం, వెల్నెస్ కేంద్రాలు ఉన్నాయి. భారతదేశంలో వైద్య చికిత్స పొందాలనుకునే, వైద్య పర్యాటకులు కావాలనుకునే విదేశీ ప్రయాణికుల కోసం వీసా ప్రక్రియను సులభతరం చేసేందుకు మా ప్రభుత్వం ప్రత్యేక వీసా వర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది," అని ఆయన చెప్పారు.

బీఎస్‌ఐ, ఐఎస్‌ఐ మార్కుల మాదిరిగానే అత్యున్నత నాణ్యమైన ఆయుష్ ఉత్పత్తులను గుర్తించేందుకు ప్రత్యేక ఆయుష్ మార్కును రూపొందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. "ఇది ప్రపంచ వినియోగదారులకు గుర్తింపు పొందిన, అధిక నాణ్యత హామీ కలిగిన ఆయుష్ ఉత్పత్తులను అందజేస్తుంది" అని ప్రధాన మంత్రి చెప్పారు. ఆయుష్‌ పార్క్‌ను ఏర్పాటు చేసి, దాని ఉత్పత్తులను తయారు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. భారతదేశంలో ఆయుష్ ఉత్పత్తుల తయారీకి ఈ పార్క్ కొత్త దిశానిర్దేశం చేస్తుంది అని ఆయన పేర్కొన్నారు.

సమ్మిట్ ప్రారంభోత్సవంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ గెబ్రేయేసస్, రిపబ్లిక్ ఆఫ్ మారిషస్ ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ పాల్గొన్నారు. ఆయుష్ ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన అప్లికేషన్లను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఆయుష్ ఉత్పత్తులపై పరిశోధన, అభివృద్ధి కోసం అనేక ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు.















Next Story