దేశ ప్రధాని మోడీకి కింగ్‌థాంగ్ ప్రజల నుండి అరుదైన గౌరవం దక్కింది. వారి సంప్రదాయం ప్రకారం విజ్లింగ్ విలేజ్ ప్రజలు.. ప్రధాని మోడీకి ప్రత్యేక రాగంతో పేరు పెట్టారు. విజ్లింగ్ విలేజ్ గ్రామాన్ని టూరిస్ట్ ప్రాంతంగా అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్న ప్రధాని మోడీకి గౌరవర్థంగా ఈ పేరు పెట్టారు. ఈ మేరకు మేఘాలయ సీఎం కె.సంగ్మా ట్వీటర్ ద్వారా తెలిపారు. అయితే ఈ ట్వీట్‌కు ప్రధాని మోడీ స్పందించారు. తనకు పేరు పెట్టినందుకు విజ్లింగ్ విలేజ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కింగ్‌థాంగ్ గ్రామం మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఉండే ఖాసీ తెగకు చెందిన ప్రజలకు ప్రత్యేకమైన పేర్లు అంటూ ఏమీ ఉండవు.
వీరు ప్రతి ఒక్కరిని ఒక రాగంతో పిలుస్తుంటారు. శిశువు జన్మించగానే తల్లిదండ్రులు ఒక రాగాన్ని సృష్టిస్తారు. దానిని ఆ శిశువుకు పేరుగా భావిస్తుంటారు. ఈ సంప్రదాయం వారి పూర్వీకుల నుండి వచ్చింది. అందుకే ఈ సంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ గ్రామానికి విజ్లింగ్ విలేజ్ అనే పేరు వచ్చింది. ఇక ఈ గ్రామం ఎత్తైన కొండలోయల్లో ఉంది. ఈ క్రమంలోనే ప్రకృతిని అస్వాదించేందుకు, అక్కడి ప్రజల సంప్రదాయాలను తెలుసుకునేందుకు దేశ విదేశాల నుండి టూరిస్ట్‌లు వస్తు వెళ్తుంటారు. విజ్లింగ్ విలేజ్ గ్రామం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుండడంతో ప్రపంచ పర్యాట సంస్థ నిర్వహించే పోటీకి భారత్ తరఫున విజ్లింగ్ విలేజ్ గ్రామాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది.