భారతీయ పాటలకు లిప్ సింక్ చేసే కిలీ, నీమా అనే టాంజానియా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ప్రయత్నాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రశంసించారు. మన్ కీ బాత్ 86వ ఎపిసోడ్ లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, "మిత్రులారా భారతీయ సంస్కృతి, మన వారసత్వం గురించి మాట్లాడుతూ.. ఈ రోజు నేను మన్ కీ బాత్‌లో మీకు ఇద్దరు వ్యక్తులను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇద్దరు టాంజానియన్ తోబుట్టువులు, కిలీ పాల్, అతని సోదరి నిమా, Facebook, Twitter, Instagramలలో ఉన్నారు. మీరు కూడా వారి గురించి తప్పక విని ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని తెలిపారు. టాంజానియాలోని భారత రాయబార కార్యాలయంలో కూడా కిలీ పాల్‌కు సన్మానం జరిగినట్లు ప్రధాని పేర్కొన్నారు.
"వారికి భారతీయ సంగీతం పట్ల అభిరుచి, ఇష్టం ఉన్నాయి. ఈ కారణంగా వారు కూడా బాగా ప్రాచుర్యం పొందారు. లిప్ సింక్ టెక్నిక్ కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన మన జాతీయ గీతం జనగణమన ఆలపించిన వీడియో వైరల్‌గా మారింది. కొన్ని రోజుల క్రితం లతా దీదీ పాటతో ఆత్మీయ నివాళులర్పించాడు. ఈ ఇద్దరు తోబుట్టువులు కిలి, నిమా వారి అద్భుతమైన సృజనాత్మకతను నేను నిజంగా అభినందిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం, టాంజానియాలోని భారత రాయబార కార్యాలయంలో కూడా అతనికి సన్మానం జరిగింది"అని మోదీ చెప్పారు. "భారతీయ సంగీత మాయాజాలం అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం, ప్రపంచంలోని నూట యాభైకి పైగా దేశాలకు చెందిన గాయకులు, వారి వారి దేశాల్లో, వారి వారి దుస్తులు ధరించి, గౌరవనీయులైన మహాత్మా గాంధీకి ఇష్టమైన భజన వైష్ణవ్ జాన్‌ను ప్రదర్శించారని నాకు గుర్తుంది" అని మోదీ చెప్పుకొచ్చారు.